ఓటుకు నోటు కేసులో వారిద్దరూ కుమ్మక్కయ్యారా..?

By Voleti Divakar Oct. 18, 2020, 06:00 pm IST
ఓటుకు నోటు కేసులో వారిద్దరూ కుమ్మక్కయ్యారా..?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్ర, ప్రస్తుత ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారా?. ఈకేసు విచారణలో ఇంప్లీడైన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిడిపి అభ్యర్థిని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ. 50లక్షల నగదు ఇస్తూ ఆపార్టీ అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో స్టీవెన్ సన్ తో మాట్లాడించడం, ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు బహిర్గతం కావడం పెద్ద దుమారాన్ని లేపింది.

అప్పుడు ఎపి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఈకేసు నుంచి తప్పించుకునేందుకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను తాకట్టు పెట్టి మరీ హడావుడిగా ఎపికి చేరుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈకేసు చంద్రబాబును రాజకీయంగా తీవ్రంగా ఇరుకున పెట్టింది. ఈకేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణా ఎసిబి అధికారులు ఈ కేసులో సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును కనీసం నామమాత్రంగా కూడా పిలిచి విచారించలేదని ఈ కేసులో ఇంప్లీడైన ఉండవల్లి వ్యాఖ్యానించడం గమనార్హం.

చంద్రబాబును జైల్లో పెట్టడం బ్రహ్మతరం కూడా కాదని తెలంగాణా సిఎం కెసిఆర్ ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారని ఉండవల్లి గుర్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ఈకేసు వ్యవహారంలో కెసిఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసిన చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రాజగురువు రామోజీరావు సహాయం తీసుకుని ఉండవచ్చని రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాలతో స్టే తొలగి విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ను తెలంగాణ ఏసీబీ కనీసం విచారిస్తుందా..? లేదా..? అనే ఆసక్త్రి నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp