ఉండవల్లి ఏం చేస్తున్నారు ? ! ..

By Voleti Divakar Jun. 10, 2021, 10:30 am IST
ఉండవల్లి ఏం చేస్తున్నారు ? ! ..

రాజకీయాల నుంచి స్వచ్చందంగా తప్పుకున్న రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది . 2004 , 2009 లో వరుసగా రెండుసార్లు రాజమహేంద్రవరం నుంచి ఎంపిగా గెలిచిన ఉండవల్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు . వైఎస్ ను అత్యంత అభిమానించే ఉండవల్లి వర్తమాన రాజకీయ , సామాజిక , ఆర్థిక విధానాల పై తనదైన శైలిలో విశ్లేషించి , విమర్శలు చేస్తారు . కరోనా 2 వ వేవ్ ముందు వరకు కనీసం నెలకు ఒకసారైనా వార్తల్లో కనిపించేవారు .

Also Read:తరువాత వంతు.. స‌చిన్ పైలెట్..?

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టును సాకారం చేసేందుకు తనదైన శైలిలో కృషిచేస్తున్న ఉండవల్లి ఇప్పటి వరకు  పోలవరం ప్రాజెక్టుపై 2 7సార్ల కు పైగా విలేఖర్ల సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు , అనేక సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు . గోదావరి నది ఎగువ ఉన్న మహారాష్ట్ర వైఖరిని గమనించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను అనాడే గుర్తించారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు . అందుకే ఉండవల్లి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు . రాష్ట్ర విభజనకు ముందు వరకు వైఎస్ సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ డిల్లీ స్థాయిలో ఉండవల్లి అరుణ్ కుమారే పర్యవేక్షించేవారు . కరోనా ఉధృతి పెరగడంతో ఆయన ఈ మధ్య వార్తల్లో కనిపించడం లేదు .

తొలినాళ్లలో జగన్ విధానాలను సమర్థించి...
జగన్ అధికారం చేపట్టిన కొత్తల్లో కొద్దిరోజుల పాటు మౌనంగా ఉన్న ఉండవల్లి ఆ తరువాత ఇసుక పాలసీని , మద్యం పాలసీని , వలంటీర్ల వ్యవస్థను సమర్థిస్తూ మాట్లాడారు . నవరత్నాలను కూడా సమర్థించారు . ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వానికి కొన్ని సలహాలు , సూచనలు కూడా చేశారు . ఆతరువాత పోలవరం సహా , మద్యం , ఇతర విధానాలపై విభేదించారు . అయితే తొలి నుంచి బిజెపి , ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తూర్పార పట్టడంలో ఇప్పటికీ ముందుంటారు .

Also Read:జగన్ ఢిల్లీ పర్యటన, విపక్షాలకు మింగుడుపడని విషయమేంటి?

పుస్తకం రాస్తున్నారా ?!
తొలి దశలో కరోనా బారినపడి కోలుకున్న ఆయన ఆతరువాత రెండు విడతల టీకాలు తీసుకుని ప్రస్తుతం తన నివాసానికే పరిమితయ్యారు . అయితే ఉండవల్లి మాత్రం ప్రస్తుత రాజకీయ , ఆర్థిక , సామాజిక పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు . వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు . అలాగే తెలుగు రాష్ట్రాల్లోని కుల వ్యవస్థపై ఉండవల్లి పుస్తకాన్ని రచిస్తున్నట్లు సమాచారం . దీనిపై పరిశోధనా , సమాచార సేకరణ పూర్తయ్యి .... ప్రచురణకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఉండవల్లి రచించే ఈ పుస్తకంపై రాజకీయ , సామాజిక వర్గాల్లో ఆసక్తి నెలకొనడం సహజమే .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp