ఇప్పుడేమంటారు బాబూ, బీజేపీ, జనసేన నేతలు

By Raju VS Apr. 07, 2021, 07:00 pm IST
ఇప్పుడేమంటారు బాబూ, బీజేపీ, జనసేన నేతలు

ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు విషయంలో డివిజన్ బెంచ్ భిన్నంగా స్పందించడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికల విషయంలో వాయిదా కు సింగిల్ బెంచ్ అంగీకరించగా, డివిజన్ బెంచ్ మాత్రం ఎస్ఈసీ వాదనను అంగీకరించింది. దాంతో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు ముగిసాయి. ఇక పరిషత్ ఎన్నికల ప్రక్రియ కూడా ముగించాల్సి ఉండగా ఈసారి దానికి భిన్నంగా సింగిల్ బెంచ్ స్పందన ఉండడంతో ఎస్ఈసీ మరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించి అనుకూల తీర్పు తీసుకురాగలిగింది. రెండుసార్లు సింగిల్ బెంచ్ తీర్పులు కొట్టేయగా, ఎస్ఈసీ పిటీషన్లకు అనుకూలంగా తీర్పు రావడం విశేషం.

అదే సమయంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ తరుపున ఆపార్టీ నేత వర్ల రామయ్య పిటీషన్ వేయడం చర్చనీయాంశం అయ్యింది. ఇక సింగిల్ బెంచ్ తీర్పు పట్ల చంద్రబాబు స్పందిస్తూ అంబేద్కర్ రాజ్యాంగ విజయంగా పేర్కొన్నారు. అదే రాజ్యాంగం ప్రకారం ఏపీ హైకోర్టు పోలింగ్ ప్రక్రియ కు అభ్యంతరాలు లేవని చెప్పింది. ఓటు హక్కు కూడా లేని వర్ల రామయ్య పరిషత్ ఎన్నికల కోసం పిటీషన్ వేసిన తీరు మీద హైకోర్టులో వాదనలు కూడా జరగడం విశేషం. ఇప్పుడు చంద్రబాబు , ఆయన పార్టీ వాదనను కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన ఏమంటారన్నది ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో బీజేపీ నేతలు కూడా కోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ అభివర్ణించారు. బీజేపీ ప్రయత్నాలతోనే ఎన్నికలు వాయిదా వేశారంటూ విష్ణువర్థన్ రెడ్డి, సోము వీర్రాజు వంటి వారు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అడ్డంకులు చెప్పేందుకు డివిజన్ బెంచ్ ససేమీరా అని చెప్పింది. మరి దీనిని ఆపార్టీ నేతలు ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాల్సి ఉంది. జనసేన కూడా పాత నోటిఫికేషన్ ప్రకారమే జరిపిన పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలకు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు పరిషత్ ఎన్నికల పట్ల వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది.

వరుసగా స్థానిక ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టం కట్టడం ప్రతిపక్షాలకు మింగుడుపడడం లేదు. దాంతోనే ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం తప్ప మరో దారి లేదనే నిర్ణయానికి ప్రధాన ప్రతిపక్షం రాగా, ఇతర పార్టీలు దానికి వంతపాడినట్టుగా తాజా పరిణామాలు చాటుతున్నాయి. అయితే న్యాయస్థానం మాత్రం ఎన్నికల ప్రక్రియలో ఎస్ఈసీకి ఉన్న అవకాశాలను తోసిపుచ్చేందుకు నిరాకరించడం ఆయా ప్రతిపక్ష పార్టీలకు నిజమైన చెంపదెబ్బగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : పరిషత్ ఎన్నికలకు పచ్చ జండా.. ఫలితాల వెల్లడికి ఎర్ర జెండా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp