సిఎం లేఖపై ఏపీ బీజేపీ స్పందనేమిటో?!

By Voleti Divakar Oct. 17, 2020, 07:30 am IST
సిఎం లేఖపై ఏపీ బీజేపీ  స్పందనేమిటో?!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాయడమే తప్పన్నట్లు, దాని బయటపెట్టడం క్రూరమన్నట్లు తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తోంది. లేఖ బయటపడిన తొలిరోజు మౌనంగా ఉన్న వారు ఆ తరువాత జగన్ ఏదో పెద్ద నేరానికి పాల్పడ్డారని ఎపి రాజకీయాల గురించి, తెలుగు భాషే ఉన్నట్లు తెలియని మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు గుప్పిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేందుకు పడరాని పాట్లు పడుతోంది.

ఎపి హైకోర్టు పనితీరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యవహారశైలి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కుమ్మక్కు రాజకీయాలు, మేనేజ్ మెంట్ నైపుణ్యతల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్లు తెలుగుదేశం మీడియా హోరెత్తిస్తోంది. తద్వారా తెలుగుదేశం మీడియా ఎపి న్యాయమూర్తుల పనితీరును లోకానికి వెల్లడించినట్టయ్యింది. అయితే తెలుగు న్యాయమూర్తులను సమర్థించే పేరొందిన ఒక్క న్యాయ నిపుణులు లేరా అన్న చర్చకు దారితీస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుంటున్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో తన వైఖరి ఏమిటో ఎపి ప్రజానికానికి తెలియరావడం లేదు.

రాజధాని భూములు, నిర్మాణం కుంభకోణం విషయంలో తొలి నుంచి గట్టిగా గళమెత్తిన బిజెపి నూతన అధ్యక్షుడు గత కొద్దిరోజులుగా నోరు విప్పకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. డిల్లీలో ఉండే రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కూడా దీని పై స్పందించకపోవడం గమనార్హం. బిజెపిలోని సోము, జివిఎల్ టిడిపి వ్యతిరేకులుగా ముద్రపడ్డారు. ఈ విషయంలో పార్టీలోని టిడిపి అనుకూల ప్రత్యర్థి సామాజిక వర్గీయులు కూడా స్పందించకపోవడం, తెలుగుదేశం మీడియాకు కనీసం లీకేజీలు కూడా ఇవ్వకపోవడం విచిత్రంగా తోస్తోంది. మౌనం అర్థాంగికారమని భావించాలా..? 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp