ఏపీ బాటలో తెలంగాణ నడిస్తేనే అది సాధ్యం

By Voleti Divakar Aug. 01, 2020, 03:30 pm IST
ఏపీ బాటలో తెలంగాణ నడిస్తేనే అది సాధ్యం

కరోనా సందర్భంగా భారతదేశంలోనే కొత్త చైనా పుట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది. కరోనా కేసులు, మరణాల విషయంలో తెలంగాణా చైనాను తలపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎపి జనాభా సుమారు 5కోట్లు ఉండగా, రోజుకు సుమారు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సుమారు 4 కోట్ల జనాభా ఉన్న
తెలంగాణా రాష్ట్రంలో మాత్రం రోజుకు దాదాపు 1500 దాటకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కరోనా మరణాల్లో కూడా ఏపీకి, తెలంగాణాకు మధ్య 50శాతం తేడా ఉండటం గమనార్హం. 

ఈలెక్కలను బట్టి చూస్తే తెలంగాణా ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడిలో సఫలమైందా?...ఈ విషయంలో ఏపీ సర్కారు విఫలమైందా.. లేకపోతే తెలంగాణా ప్రజలు పూర్తి స్థాయిలో రోగ నిరోధకశక్తి కలిగి, కరోనా వైరస్ జొరబడకుండా మాస్కులు కట్టి, ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుంటూ ఇళ్ల తాళాలు బిగించుకున్నారా?. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఎపి ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ కరోనాను కొనితెచ్చుకుంటున్నారన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే వాస్తవం మాత్రం వేరుగా ఉంది. తెలంగాణాలో కన్నాఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువ జరుగుతున్నాయి. దీంతో సహజంగానే ఏపీలో రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతూ దేశంలోనే కరోనా విషయంలో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. గ్రామాలు, వార్డుల వారీగా సంజీవిని బస్సులను ఏర్పాటు చేసి మరీ పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణా సర్కారు కరోనా నిర్ధారణ పరీక్షలనే పక్కన పెట్టేసింది.

తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తూ తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు నమ్మిస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ మహా నగరంలోనే లక్షల సంఖ్యలో కరోనా అనుమానితులు ఉన్నట్లు అంచనా. కరోనా మరణాలను కూడా తెలంగాణా సర్కారు దాస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణాలో ఒక్కసారిగా కరోనా విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా కట్టడిలో ఆంద్రప్రదేశ్ బాటలో తెలంగాణ నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం పొంచి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp