Prasanth kishore - ప్రశాంత్ కిషోర్, రెండు లక్ష్యాలతో పావులు కదుపుతున్న వ్యూహకర్త

By Raju VS Dec. 04, 2021, 10:55 am IST
Prasanth kishore - ప్రశాంత్ కిషోర్, రెండు లక్ష్యాలతో పావులు కదుపుతున్న వ్యూహకర్త

ఎన్నికల వ్యూహాకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో సెంటర్ పాయింట్ గా మారేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకు కాంగ్రెస్ ఆసరా తీసుకోవాలని ఆయన ఆశించినా ఆపార్టీ అందుకు నిరాకరించింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ ని కార్నర్ చేసి తాను అనుకున్నది సాధించాలనే తాపత్రయంలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు గానూ మమతా బెనర్జీని ముందు పెట్టి పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. ఓవైపు మమతా మరోవైపు తాను కలిసి కాంగ్రెస్ ని మరింత కుదేలు చేయాలనే లక్ష్యంతో ఉన్నామనే విషయాన్ని దాచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు లేదు. ఇప్పటికే వారిద్దరూ కాంగ్రెస్ ని ఖాతరు చేయడంలేదనే రీతిలో మాట్లాడుతూ ఇతర విపక్షాలను తమవైపు తిప్పుకునే యత్నంలో ఉన్నారా అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.

గడిచిన కొన్ని రోజులుగా టీఎంసీ అధినేత్రి, ఆమెకు స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన ఐప్యాక్ వ్యవస్థాపకుడి తీరు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేరుగా పీకే మీద గురిపెట్టి ప్రత్యారోపణలకు సిద్ధమవుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు కూడా సాగుతున్నాయి. దీని వెనుక ప్రశాంత్ కిషోర్ పక్కా ప్రణాళిక ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయంగా తాను నిత్యం వార్తల్లో ఉండాలనే లక్ష్యంతో ఆయన ఉన్నట్టు ఈ పరిణామాలు చెబుతున్నాయి. అందుకు మమతా బెనర్జీ సహాయం కూడా ఉండడంతో ఇద్దరూ కలిసి ఇప్పుడు తమ ఉమ్మడి లక్ష్య సాధనలో అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది.

వారిద్దరూ ప్రధానంగా కాంగ్రెసేతర పక్షాలకు కేరాఫ్ గా మారాలని కుతూహులంగా ఉన్నట్టు కొందరు భావిస్తున్నారు. బీజేపీకి పోటీగా కాంగ్రేసేతర పార్టీలతో కలిసి ఓ కూటమి కట్టాలనే యత్నంలో ఉన్నారా అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్, బీజేపీ లను ఏకకాలంలో వ్యతిరేకించే వివిధ పార్టీలను కలుపుకుని పోయే పని ప్రారంభించారనే అంచనాలు పెంచుతున్నారు. ఉదాహరణకు ఏపీ తెలంగాణాల్లో ఈ రెండు జాతీయ పార్టీలను వ్యతిరేకించే వారే అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇటీవల కేసీఆర్ తో ఐప్యాక్ టీమ్ సమావేశం వెనుక కూడా అలాంటి జాతీయ వ్యూహాలకు అనుగుణంగానే ఉంటుందనే వారు పెరుగుతున్నారు. తద్వారా రెండు పార్టీలను వ్యతిరేకించే వారందరినీ కలుపుకుని ఓ కూటమిగా ముందుకు రావాలనే తపన పీకే-మమతా మదిలో ఉందనే అభిప్రాయం బలపడుతోంది.

కాంగ్రేసేతర విపక్షాల కూటమి అనివార్యంగా కాంగ్రెస్ కి నష్టం చేకూర్చడమే కాకుండా బీజేపీకి తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారు. మోడీ వ్యతిరేక కూటమిలో చీలిక ద్వారా బీజేపీకి మేలు చేసే ఎత్తుగడగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీఎంసీ-బీజేపీ మధ్య దానికి అనుగుణంగా ఓ రహస్య ఒప్పందం కూడా కుదిరింందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల డిల్లీ పర్యటనలో మోడీ తో మమతా భేటీ వెనుక కారణమదేనని వారి అభిప్రాయం.

అంతేగాకుండా టీఎంసీకి సంబంధించిన వివిధ అవినీతి కేసుల్లో విచారణ ముందుకు సాగకపోవడం కూడా అందులో భాగమేననేది వారి వాదన, పలు కుంభకోణాలను అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడిగా తెరమీదకు తీసుకొచ్చి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అవసరాల రీత్యా వాటిని కప్పిపుచ్చే యత్నంలో కమలనాధులున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. వారి మాటల వెనుక వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం బెంగాలీ దీదీ విషయంలో కేంద్రం ఉదాశీనంగా ఉండడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. అదే సమయంలో విపక్షాలను బలహీనపరిచి, ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే మోడీ వ్యూహాన్ని దీదీ, పీకే జంటగా అమలు చేస్తున్నట్టు సందేహాలు పెరుగుతున్నాయి.

దానికి తోడుగా పీకే మరో లక్ష్యాన్ని కూడా మనసులో ఉంచుకుని ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. డిల్లీ వర్గాల్లో సాగుతున్న చర్చల ప్రకారం వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత ఎవరికీ మెజార్టీ దక్కని నేపథ్యంలో మోడీ కి ప్రత్యామ్నాయంగా తమలో ఒకరు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని దీదీ, పీకే భావనగా చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిగా హడావిడి చేస్తే దాని ప్రభావం ఫలితాల తర్వాత ఉంటుందని వారు విశ్వసిస్తున్నట్టుగా లెక్కలేస్తున్నారు. అనూహ్య పరిణామాల్లో మోడీ కి వ్యతిరేకంగా తామే ప్రత్యామ్నాయం కాగలుగుతామనే భావనతోనే ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

నేటికీ ఉత్తరాది, మధ్య భారతంలోని 190 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా నేటికీ కాంగ్రెస్ ఉంది. గడిచిన ఎన్నికల్లో వాటిలో కేవలం 15 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలవడంతో ఆపార్టీ బాగా వెనుకబడింది. దేశవ్యాప్తంగా 50పైగా స్థానాలు దక్కినప్పటికీ 20 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. వచ్చే ఎన్నికలలో అధమపక్షం ఆపార్టీకి 50 సీట్లకు తగ్గే అవకాశం లేదు. మరింత పెరగవచ్చనే అభిప్రాయం ఉంది. దాంతో కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యమయ్యే అవకాశం లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కాంగ్రెస్ మద్ధతుతోనే యునైటెడ్ ఫ్రంట్ వంటి ప్రయోగాలకు తెరలేపవచ్చనే అంచనా పీకే, దీదీకి ఉండొచ్చని చెబుతున్నారు. ఏమయినా దీదీ, పీకే రెండు లక్ష్యాలు కలిసి చివరకు మోదీకి మరింత మేలు చేసేందుకు దోహదపడతాయనే అభిప్రాయం అత్యధికుల్లో రావడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp