మాజీ ఎమ్మెల్యే రౌతుకు నామినేటెడ్‌ పదవి దక్కనిది ఇందుకేనా..?

By Aditya Sep. 24, 2021, 02:00 pm IST
మాజీ ఎమ్మెల్యే రౌతుకు నామినేటెడ్‌ పదవి దక్కనిది ఇందుకేనా..?

రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుకు ఏ నామినేటెడ్‌ పదవి ఇస్తారా అని లెక్కలు వేసిన ఆయన అభిమానులు, రాజకీయ పరిశీలకులు ఆయనకు ఏదీ దక్కకపోవడంతో కారణాలు వెతుకుతున్నారు. 2004, 2009లలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా రాజమహేంద్రవరం సిటీ నుంచి ఎన్నికయ్యారు. సౌమ్యుడు, వివాద రహితుడిగా ఆయనకు పేరుంది. గోదావరి స్విమ్మర్స్‌ క్లబ్‌కు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయన మంచి ఈతగాడు కూడా! ఆయన తండ్రి రౌతు తాతాలు రాజమహేంద్రవరంలోని రంభ, ఊర్వశి, మేనక థియేటర్ల యజమాని.

మళ్లీ టీడీపీ బోర్డు మెంబర్‌ పై ఆశలు

రెండోసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన రౌతు టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. మొన్న జరిగిన నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో ఈసారీ ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్‌గా అవకాశం ఇస్తారని అయన అనుచరులు భావించారు. రౌతుతో సహా ఆయన అభిమానులు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నారు కూడా. అయినా పదవి వరించకపోవడానికి కారణం ఏమిటా అనే చర్చ నడుస్తోంది.

Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం

ఇదీ ఆయన ఎన్నికల ప్రస్థానం..

తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రౌతు సూర్యప్రకాశరావు రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధక్షుడుగా పని చేశారు. మొదటిసారి 2004 వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 41,826 ఓట్లు సాధించి గెలిచారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై 7,544 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండోసారి అంటే 2009లో   కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన ఈయన 41, 369 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గోరంట్లపై బుచ్చయ్యచౌదరిపై 1,284 ఓట్లు ఆధిక్యంతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చల్లా శంకరరావు పోటీ చేయగా ఆయనకు 39,384 ఓట్లు వచ్చాయి. ఈ ముక్కోణపు పోటీ వల్ల రౌతు బొటాబొటీ మెజార్టీతో గెలిచారని విశ్లేషకులు భావించారు.

2014లో వైఎస్సార్‌ సీపీ ఈయనకు సీటు ఇవ్వలేదు. ఆ పార్టీ తరఫున దివంగత  బొమ్మన రాజకుమార్‌ పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రౌతుకు వైఎస్సార్‌ సీపీ టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రౌతు 53,637 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ 83,702 ఓట్లు సాధించడంతో ఈయన 30,065 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేన తరఫున అత్తిలి సత్యనారాయణ పోటీ చేయగా ఆయనకు 23,096 ఓట్లు వచ్చాయి.

భారీ ఓట్లతో తేడాతో ఓడిపోవడమే కారణమా?

రౌతు సూర్యప్రకాశరావు భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం వల్లే నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం రాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయన అభిమానులు ఈ వాదనను ఖండిస్తున్నారు. తమ నేత వరుసగా రెండుసార్లు రాజమహేంద్రవరం సిటీలో  గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ఓడించారని అంటున్నారు. అదే గోరంట్ల చేతిలో వరుసగా రెండుసార్లు రాజమహేంద్రవరం రూరల్‌లో ఓడిపోయిన ఆకుల వీర్రాజుకు డీసీసీబీ చైర్మన్‌గా నియమించారు కనుక తమ నాయకుడికి కూడా అవకాశం వస్తుందని అంటున్నారు. రెండు దఫాలు వరుసగా గెలిచిన చరిత్రే కాక పక్కపార్టీల వైపు చూడకపోవడం కూడా ఈయన ప్రత్యేకతని అంటున్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ అజాత శత్రువుగా పేరొందిన తమ నాయకుడు రౌతు సేవలను వైఎస్సార్‌ సీపీ అధిష్టానం గుర్తించి తప్పక పదవి ఇస్తుందని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp