భార‌త్ - చైనా చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగిందంటే...?

By Kalyan.S Sep. 22, 2020, 04:34 pm IST
భార‌త్ - చైనా చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగిందంటే...?

భార‌త్ - చైనా దేశాల స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు నెల‌ల త‌ర‌బ‌డి కొన‌సాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్త‌త‌లు చ‌ల్లార‌డానికి భార‌త్ ఓ వైపు చ‌ర్చ‌లు జ‌రుపుతూనే.. మ‌రోవైపు ఎటువంటి ప‌రిస్థితుల‌ను అయినా ఎదుర్కొనేలా స‌ర్వ స‌న్నాహాలు చేస్తోంది.

తాజాగా మ‌రోసారి ఇరు దేశాల మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ‌లు సాగాయి. తూర్ప ల‌ద్దాఖ్ లో ఉద్రిక్త‌త‌లు చ‌ల్లారేలా ఈ చ‌ర్చ‌లు సుదీర్ఘంగా జ‌రిగాయి. సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన చ‌ర్చ‌లు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగిన‌ట్లు తెలుస్తోంది. భార‌త్ లోని ఛుఘాల్ సెక్టార్ కింద‌కు వ‌చ్చే చైనాలోని భూభాగం మాల్డో వ‌ద్ద ఈ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. చ‌ర్చ‌ల్లో ఇరు దేశాల సీనియ‌ర్ సైనికాధికారులు పాల్గొన్నారు.

భార‌త్ డిమాండ్లివే..

లేహ్ వ‌ద్ద ఉన్న 14వ ప‌టాలం అధిప‌తి లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ హ‌రీంద‌ర్ సింగ్ ఈ చ‌ర్చ‌ల‌కు నేతృత్వం వ‌హించారు. ఆయ‌న త‌ర్వాత ఈ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ పీజీకే మీన‌న్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ చ‌ర్చ‌ల్లో మొద‌టి సారిగా విదేశాంగ శాఖ‌కు చెందిన సీనియ‌ర్ అధికారి, ద‌క్షిణాసియా వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి న‌వీన్ శ్రీ వాస్త‌వ పాల్గొన‌డం ఈసారి విశేషంగా మారింది. రెండు దేశాలూ కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌రుపుతున్న స‌రిహ‌ద్దు చ‌ర్చ‌ల్లో ఈయ‌న కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 10న మాస్కోలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల స‌మావేశంలో కుదిరిన ఐదు సూత్రాల ప్ర‌ణాళిక‌ను నిర్దిష్ట కాల‌వ్య‌వ‌ధిలోగా అమ‌లు చేయాల‌ని తాజా చ‌ర్చ‌ల్లో భార‌త్ డిమాండ్ చేసింది. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద య‌థాత‌థ స్థితి కొన‌సాగాల‌ని, ఎల్ఏసిని గౌర‌వించాల‌ని, మే 5 కంటే ముందునాటి ప‌రిస్థితిని పున‌రుద్ధ‌రించాల‌ని భార‌త్ డిమాండ్ చేసిన‌ట్లు తెలిసింది. అయితే దీనికి చైనా నుంచి స‌రైన స‌మాధానం రాలేద‌ని తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp