అయ్యో బాబూ.. దీదీకి అక్కరకు రాకుండా పోయావే!

By Ramana.Damara Singh Apr. 01, 2021, 01:15 pm IST
అయ్యో బాబూ.. దీదీకి అక్కరకు రాకుండా పోయావే!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి , సీఎం మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని 15 పార్టీలకు రాసిన లేఖ చర్చకు దారితీసింది. బెంగాల్లో రెండోదశ పోలింగ్ కు ఒకరోజు ముందు రాసిన ఈ లేఖలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే మమతా లేఖలు పంపిన పార్టీల జాబితాలో తెలుగుదేశం మిస్ అవ్వడం విశేషం.

గతంలో జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పిన అపార అనుభవశాలి అయిన చంద్రబాబును దీదీ ఎలా..ఎందుకు మర్చిపోయారబ్బా.. అనుకుంటూ టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే బాబుగారి ఊసరవెల్లి రాజకీయాలు, ఏపీలో ఆ పార్టీ పతనం అంచున ఉండటం గమనించే మమత ఆయన్ను, ఆయన పార్టీని పట్టించుక్కలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రెండేళ్లుగా బీజేపీతో ఇబ్బందులు

బీజేపీ నేతృత్వంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి.. ప్రత్యేకించి కమలం పార్టీ నుంచి గత రెండేళ్లుగా మమత సర్కార్, పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2019 ఎన్నికల ముందు వరకు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న బీజేపీ.. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని మొత్తం 42 లోకసభ స్థానాల్లో ఏకంగా 18 కైవసం చేసుకోవడం ఆ పార్టీలో ఆశలు రేపింది. అదే ఊపులో బెంగాల్ అసెంబ్లీలోనూ పాగా వేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఆనాటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ మమత ప్రభుత్వం, పార్టీపై ఎదురుదాడి ప్రారంభించింది. అటు గవర్నర్ ద్వారా పాలన వ్యవహారాల్లోనూ అడ్డంకులు సృష్టించి చికాకు పెట్టింది.

మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేసి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంది. మమతకు కుడిభుజంలా ఉన్న మంత్రి సువేందు అధికారిని సైతం కమలంలో కలిపేసుకొని.. మమతను నందిగ్రామ్ బరిలోకి లాగింది. వీటన్నింటి ఫలితంగా మూడోసారి సీఎం అవ్వాలనుకుంటున్న దీదీ అందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి కారణమైన కమలదళాన్ని కాకవికాలం చేయాలన్న కసి, అగ్రహంతోనే మమత దేశంలోని 15 పార్టీల నేతలకు లేఖలు రాశారు.

ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాక్కొని లెఫ్టినెంట్ గవర్నర్ ను సర్వాధికారిని చేసే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్లును ప్రస్తావించి ఆమె.. రాష్ట్రాల హక్కులను హరించేలా బీజేపీ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి కార్యాచరణ చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు.

Also Read : బీజేపీలో జగన్‌ కోవర్టులున్నారట..! వారెవరో హింట్‌ కూడా ఇచ్చిన అచ్చెం నాయుడు..!

మమత అజెండాలో బాబు మిస్

దేశంలోని 15 పార్టీల అధినేతలకు లేఖలు రాసిన మమత టీడీపీ చంద్రబాబును మాత్రం పట్టించుకోలేదు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ పేరు తోనూ, 2019 ఎన్నికల సమయంలో మహాఘటబంధన్ (గ్రాండ్ అలయెన్స్) పేరుతోనూ చంద్రబాబు నానా హడావుడి చేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ గొప్పలు చెప్పుకునేవారు. దేశ రాజకీయాలను శాసించే జాతీయ నాయకుడు మా చంద్రబాబు అంటూ టీడీపీ నాయకులు భుజాలు చరుచుకునేవారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రాంతీయ పార్టీల తరపున ప్రచారం కూడా చేసేవారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ బెంగాల్, ఢిల్లీ సీఎం లను విశాఖపట్నం రప్పించి తనకు మద్దతుగా ప్రచారం చేయించుకున్న బాబు.. తాను కూడా బెంగాల్ వెళ్లి కోల్కతా, ఖరగపూర్ తదితర ప్రాంతాల్లో రెండురోజులపాటు ప్రచారం చేశారు. అటువంటిది ప్రస్తుత బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి తీవ్ర సవాల్ ఎదురవుతున్నా ఒంటరిగానే పోరాడుతున్న మమత.. సాయంగా ప్రచారానికి రావాలని చంద్రబాబును కోరడానికి ఇష్టపడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా జాతకట్టడానికే ఆహ్వాన లేఖా పంపలేదు.

బాబు అయిపోయిందని గుర్తించేశారా?

సార్వత్రిక ఎన్నికల ముందు మహా కూటమి పేరుతో చంద్రబాబు నానా హడావుడి చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ కూటమి కేంద్రంలో అధికారం చేపడుతుందని చెప్పారు. కానీ ఫలితం రివర్స్ అయింది. ఏపీలో బాబుగారి టీడీపీకే దిక్కులేకుండా పోయింది. వైఎస్సార్సీపీ చేతిలో ఆ పార్టీ చావుదెబ్బ తిన్నది. ఇక దేశంలో పూర్తి మెజార్టీతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడంతో బాబు కలలు చేదిరిపోయాయి. దానికితోడు అధికారం పోయిన తర్వాత చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి కేంద్ర సంబంధిత అంశాల్లో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం పక్కన పెట్టి కనీసం ఒక్కమాటైనా అనే సాహసం చేయడం లేదు.

రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సీన్ అయిపోయిందని భావించారో ... ఏమో గానీ.. మొత్తానికి బాబు స్వీయజాతీయ నాయకుడి హోదాకు మమత ఆ విధంగా మంగళం పాడేశారు.

Also Read : ఆత్మాభిమానం నుంచి పుట్టి.. ఆత్మనే మట్టుబెట్టి..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp