చివరకు బాండ్ పేపర్ కూడా ఓట్లను రాల్చలేదు...

By Rishi K Feb. 22, 2021, 09:30 am IST
చివరకు బాండ్ పేపర్ కూడా ఓట్లను రాల్చలేదు...

హామీలు ఇవ్వడమే కాదూ.. నమ్మకమూ సంపాదించుకోవాలి.. ఓటరు నమ్మితే అందళం ఎక్కించగలడు లేకుంటే అదఃపాతాళానికి తొక్కేయగలడు.. అందుకే ఓటర్లను వరాలిచ్చే దేవుళ్ళులా కొలుస్తారు అభ్యర్థులు. గెలిచేంత వరకూ ఓటర్ల నామ స్మరణ చేస్తారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు చేయని ప్రయత్నాలు ఉండవు.. చీరలు,బిర్యానీ ప్యాకెట్లు,మందుతో పాటు డబ్బులు వెదజల్లుతారు.. కొందరైతే ఏకంగా మిక్సీలు,ఫ్యాన్లను కూడా పంచగా ఒక అభ్యర్థి అయితే తిరుపతి లడ్లు పంచుతూ వార్తల్లో నిలిచాడు..ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంతగా ప్రలోభపెట్టినా ఓటర్లు తమకు నచ్చిన వారికే ఓట్లు వేసి మిగిలిన అభ్యర్థులకు షాక్ ఇస్తారు..

డబ్బును వెదజల్లడం, ఇష్టారీతిలో హామీలు గుప్పించడం ఎన్నికల్లో సర్వసాధారణంగా కనిపించే విషయాలు. ఎలాగూ హామీలు నెరవేర్చాలని రూల్ లేదు కాబట్టి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాయి రాజకీయ పార్టీలు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తుది విడత పంచాయితీ ఎన్నికల్లో ఊబలంక పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి ఇచ్చిన హామీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాయి. దానికి ఓ కారణం ఉంది. తమను గెలిపిస్తే ఐదు రకాల పథకాలను అంటే పంచ రత్నాలను ఫ్రీగా ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. అంతేకాకుండా ఏకంగా బాండ్ పేపర్ పై నోటరీ చేయించి అందులో తాము చేయాలనుకున్న పథకాలను ముద్రించి సంతకం చేసి ఊరి పెద్దలకు అందించారు.

Also Read:- అన్నీ ఫ్రీ ఫ్రీ! స్టాంప్ పేపర్ పంచేస్తున్న ఆ జిల్లా వాళ్ళు!

తాము గెలిచిన తర్వాత ఏ పథకం అమలు చేయకపోయినా హామీలు నెరవేర్చకపోతే చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవచ్చు అని ఓటర్లకు చెప్పడం విశేషం... ఆ సర్పంచి వర్గం చేస్తామన్న పథకాలు కూడా ప్రజలను ఆకర్షించే విధంగానే ఉన్నాయి.. పంచాయితీలో ఉన్న కుటుంబాలకు ఏడాదిపాటు ఉచితంగా మినరల్‌ వాటర్ ఇంటింటికి ఇవ్వడం, సంవత్సరంపాటు రేషన్ తీసుకునే కుటుంబాలకు రేషన్‌ ఫ్రీగా అందిస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాది పాటు కేబుల్‌ ప్రసారాలు ఇస్తామని, గ్రామంలో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పదివేల రూపాయలు స్కాలర్షిప్పులు ఇస్తామని, గ్రామస్తులందరికీ మూడు నెలలకు ఒకసారి బిపి, షుగర్ , థైరాయిడ్ ఇతర ఆరోగ్య పరీక్షలు దగ్గరుండి చేస్తామని బాండ్ పేపర్ పై ముద్రించి నోటరీ చేయించి ఆ ఊరి పెద్దలకు అందించారు..

ఈ బాండ్ పేపర్ వ్యవహారం మీడియాలో రావడంతో రాష్ట్రంలో ఊబలంక పంచాయితీ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.. ఓటర్లు బాండ్ పేపర్ అభ్యర్థిని గెలిపించారా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఊబలంక పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా మేడిశెట్టి సురేఖను గెలిపిస్తే పంచ రత్నాలు ఫ్రీగా ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చినా ఓటర్లు మొహం చాటేశారు.. మెడిశెట్టి సురేఖను మూడో స్థానానికి పరిమితం చేసేసారు. ఊబలంక సర్పంచిగా వైకాపా స్వతంత్ర అభ్యర్థి కొక్కిరిగడ్డ లక్ష్మిని గెలిపించారు. దీంతో ఓటర్లు హామీలను కాకుండా అభ్యర్థిని చూసి ఓటు వేస్తారని మరోసారి రుజువైంది.

హామీలు ఎన్ని ఇచ్చినా ఓటర్ల మనసులో స్థానం సంపాదించిన అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేస్తారని ఊబలంక ఎన్నికను చూసి అర్థం చేసుకోవచ్చు. హామీలు ఎవరైనా ఎన్నైనా ఇవ్వొచ్చు.. కానీ ప్రజలు విశ్వసించిన వారికే ఓట్లు రాలతాయి. సింహాసనం దక్కుతుంది. ప్రజల నమ్మకాన్ని కోల్పోతే ఎన్ని హామీలిచ్చి ఎంతగా ఖర్చు పెట్టినా ఒరిగేది శూన్యమే..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp