Vizag Steel - రైతుల విజయమే స్ఫూర్తి.. బిగుస్తున్న ఉక్కు పిడికిలి

By Ramana.Damara Singh Nov. 26, 2021, 05:15 pm IST
Vizag Steel - రైతుల విజయమే స్ఫూర్తి.. బిగుస్తున్న ఉక్కు పిడికిలి

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అకుంఠిత దీక్షతో ఉద్యమించడం ద్వారా రైతులోకం సాధించిన విజయం విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. మరింత పట్టుదలగా పనిచేస్తే.. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచితే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్న ఆశలు ఉక్కు ఉద్యమకారుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం తీసుకోవడంతో పాటు.. ఉద్యమాన్ని మరింత విస్తరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నేపథ్యంలో పోరాట కమిటీ సమావేశంలో సరికొత్త కార్యాచరణను రూపొందించారు. దీంతో ఉక్కు ఉద్యమం తీవ్రతరం కానుంది.

11 నెలలుగా పలు రూపాల్లో ఉద్యమం

నష్టాల సాకుతో ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంటులో తనకున్న వంద శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉక్కు ప్రైవేటీకరణకు తలుపులు తెరిచింది. దీనికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి జనవరి నెల నుంచి ఉద్యమం నిర్వహిస్తున్నారు. ధర్నాలు, బందులు, రాస్తారోకోలు, మానవహారాలు, హర్తాళ్ళు, ముట్టడులు, రిలే దీక్షలు.. ఇలా అనేక రూపాల్లో ఉద్యమం కొనసాగుతోంది. మరోవైపు ఫ్యాక్టరీ వద్ద ఉద్యమకారుల రిలే నిరాహార దీక్షలు 288వ రోజుకు చేరుకున్నాయి. గతంలో పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు మూడు నెలల క్రితం ఢిల్లీ వెళ్లి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రులను కలిసి ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం కనికరించలేదు. పెట్టుబడుల ఉప సంహరణ దిశగానే ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో ఏడాదికి పైగా అఖండ ఉద్యమం ద్వారా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఉద్యమంతో కేంద్రం వెనుకంజ వేయడం, చట్టాల రద్దుకు చర్యలు చేపట్టడం వంటి పరిణామాలు ఉక్కు ఉద్యమకారుల్లో కొత్త ఉత్తేజం నింపాయి. మరింత శక్తిమంతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్రాన్ని కదిలించాలన్న స్థిర నిర్ణయానికి వచ్చేలా చేశాయి.

సీఎం జగన్ కు లేఖ

ఉక్కు ఉద్యమానికి చేయూతనివ్వాలని, ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి మరో లేఖ రాయాలని ఉక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను కోరింది. ఈ మేరకు సీఎంకు లేఖ రాసింది. ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేయించి పంపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు స్వయంగా కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి అటువంటి ప్రయత్నం చేయాలని కమిటీ తన లేఖలో కోరింది. ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలని కోరుతూ అసెంబ్లీలో మరోమారు తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు స్టీల్ ప్లాంట్ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమ విస్తృతిలో భాగంగా కూర్మన్నపాలెం నుంచి ఫ్యాక్టరీ ప్రధాన గేట్ వరకు ఐదు ప్రాంతాల్లో భారీగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ తికాయత్ వంటి వారి సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు.

Also Read : Bjp.Modi - గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp