విజయవాడ టీడీపీలో చంద్రబాబు మాట వినే నాయకులు ఎవరు?

By Raju VS Jun. 15, 2021, 09:20 pm IST
విజయవాడ  టీడీపీలో చంద్రబాబు మాట వినే నాయకులు ఎవరు?

అసలే తెలుగుదేశం పార్టీకి కష్టకాలం. అధికార వైఎస్సార్సీపీ దూకుడుని అడ్డుకోవడం చంద్రబాబు తరం కావడం లేదు. అలాంటి సమయంలో తమ్ముళ్ల మధ్య తగాదాలు టీడీపీని తీవ్రంగా కలచివేస్తున్నాయి. అవకాశాలు వస్తున్నా అందిపుచ్చుకోలేకపోతున్నామని పార్టీ శ్రేణులు వాపోవాల్సి వస్తోంది. అందులోనూ ముఖ్యంగా టీడీపీకి సామాజిక సమీకరణాల రీత్యా గట్టిపట్టున్న ప్రాంతంగా చెప్పుకునే విజయవాడలోనే ఆపార్టీ నేతల తీరు ఇష్టారాజ్యంగా మారింది. ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది. దాని ఫలితం మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో చవిచూశారు. అయినా పాఠాలు నేర్చుకోకపోవడంతో టీడీపీ కోలుకునే అవకాశాలు కష్టమేననే అభిప్రాయం వినిపిస్తోంది.

విజయవాడలో ఎంపీగా కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. కానీ ఈ ఇద్దరు నేతలు పెద్దగా పార్టీ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం లేదు. గద్దె అప్పుడప్పుడూ నియోజకవర్గం సమస్యలతో పాటు టీడీపీ వ్యవహారాల గురించి కొంత ఆసక్తి చూపుతున్నా నాని మాత్రం పూర్తిగా వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమయ్యారు. పార్టీ అధినేత తీరు మీద ఎంపీకి చాలాకాలంగా అసంతృప్తి ఉందన్నది బహిరంగ రహస్యం. దానికి ప్రదాన కారణం బుద్ధా వెంకన్న వంటివారిని ప్రోత్సహించడమేనన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇటీవల కార్పోరేషన్ ఎన్నికల్లో దాదాపుగా రోడ్డు మీదనే ఎంపీని నిలదీసే పరిస్థితికి వెంకన్న వర్గం రావడంతో ఈ వైరం ముదిరిపాకాన పడింది. చంద్రబాబు సూచనలతో అప్పట్లో తాత్కాలికంగా సర్థుబాటు చేసుకున్నా అది కొనసాగుతూనే ఉంది.

ఇక బొండా ఉమా కూడా తన భవిష్యత్ తాను చూసుకోవాలనే సంకల్పానికి వచ్చారు. కానీ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఆయన తెలుగుదేశంలో కొనసాగుతున్నట్టు అనుచరులు సైతం అంగీకరిస్తున్నారు. టీడీపీ కోలుకునే అవకాశం లేదని ఆయన విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది. అయినా తప్పనిస్థితిలో టీడీపీలో సాగుతున్నప్పటికీ ఇటీవల ఆయన కూడా పెద్దగా పార్టీ ఆఫీసు మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఇక నగర వ్యవహారాల్లో దేవినేని ఉమా పాత్ర మీద కూడా పలువురికి అభ్యంతరాలున్నాయి. గతంలో దేవినేని వర్సెస్ వల్లభనేని వంశీ అన్నట్టుగా వ్యవహారం ఉండేది. ప్రస్తుతం వంశీ స్థాయిలో కాకపోయినా ఇతర నేతలు కూడా ఉమా తీరు మీద అసంతృప్తితో కనిపిస్తున్నారు.

పార్టీ శ్రేణులను సమన్వయం చేయాల్సిన అధినేత మాటను కూడా అనేక మంది ఖాతరు చేయకపోవడం కీలక పరిణామం. గతంలో చంద్రబాబు చెబితే అలానే చేయడానికి సిద్ధపడిన నేతలు కూడా ఇప్పుడు ససేమీరా అంటున్నారు. ఎదురుగా తల ఊపినా క్షేత్రంలో తమకు తోచింది చేస్తున్నారు. అయినా టీడీపీ అధినేత ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా బెజవాడ టీడీపీని బెంబేలెత్తిస్తోంది. పార్టీ బలోపేతం కాదు కదా ఉన్న బలాన్ని కాపాడుకోవడమే పెద్ద సవాల్ గా మారుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp