ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుకి మూడేళ్లు..!

By Kalyan.S Aug. 11, 2020, 11:41 pm IST
ఉపరాష్ట్రపతిగా  వెంకయ్య నాయుడుకి మూడేళ్లు..!

ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపరాష్ట్రపతి గా ఎదిగిన ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆ పదవిలో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. బలమైన సంకల్పం, సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ఉపరాష్ట్రపతిగా మూడేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేస్తుకున్న సందర్భంగా “కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్” పేరుతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఢిల్లీ ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.

ఈ పుస్తకానికి సంబంధించిన డిజిటల్ వెర్షన్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఆవిష్కరించారు. ఈ మూడేళ్ళ ప్రయాణంలో ముఖ్యమైన పర్యటనలు, ప్రసంగాలు, పరివర్తన కార్యక్రమాల వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించడం విశేషం. 334 చిత్రాలు, 251 పేజీలతో రూపొందించిన ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పబ్లికేషన్ విభాగం ముద్రించింది.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, మూడేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, అన్నింటికీ మించి గతేడాది కాలంలో రాజ్యసభలో అనేక బిల్లులు ఆమోదం పొందడం మరింత సంతృప్తిని అందించిందని తెలిపారు. తన మూడో ఏడాదికి ఎంతో ప్రత్యేకత ఉందన్న ఆయన, ఆగష్టు 2019 నుంచి మార్చి వరకూ అనేక వరుస కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలవడం, మాట్లాడడం, దిశానిర్దేశం చేయడం లాంటివి చేశానని, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా గతంలో వలే ప్రజల వద్దకు వెళ్ళడం కుదరలేదని తెలిపారు. ఎప్పుడూ నాలుగు రోజులకు మించి ఒకే చోట గడపని ఆయనకు, ఇంత కాలం ఒకే చోటకు పరిమితం కావడం ముఖ్యంగా ప్రజల్ని కలవలేకపోవడం కాస్తంత అసంతృప్తిగా అనిపించినా, ఇదో కొత్త అనుభవం అని తెలిపారు. మనసును సంసిద్ధం చేయడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు.

మొదటి దశలో..

ఈ ఏడాది మొదటి దశలో నెలకు సుమారు 20కి పైగా సందర్భాల్లో ప్రజలను కలిశానని, 70కి పైగా ప్రసంగాలు చేశానని, 14 స్నాతకోత్సవాల్లో యువతకు మార్గనిర్దేశం చేశానని, 6 దేశాల్లో పర్యటనలు సాగించానని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తానెంతో అభిమానించే రైతులు, మన దేశ భవిష్యత్ విధాతలైన విద్యార్థులు సహా యువకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయుల్ని కలిశానని తెలిపారు. అనంతరం కోవిడ్ కారణంగా సామాజిక మాథ్యమాల ద్వారా ప్రజలకు చేరువ అయ్యాననీ అన్నారు.

350 ట్వీట్లు.. 55 ఎఫ్ బీ పోస్టులు..

ఉపరాష్ట్రపతి, ఏప్రిల్ నుంచి 350 ట్వీట్లు, 55 ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా ప్రజలతో మనోగతాన్ని పంచుకున్నానని, అదే విధంగా దాదాపు 1600 మందితో ఫోన్ ద్వారా సంభాషించి, ప్రజలకు దూరంగా ఉన్నా, ఫోన్ ద్వారా చేరువ అయ్యానన్నారు. అందుబాటులో సమయాన్ని ఉపయోగించుకోవడం భాగంగా విస్తృతంగా పుస్తకాలు చదవడానికి సమయం సద్వినియోగం చేసుకున్నానని, విస్తృతంగా వ్యాసాలు రాసేందుకు ఇదెంతో సహాయపడిందని తెలిపారు.

కరోనా గురించి ఎవరూ భయందోళనకు గురి కావద్దని త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో ఏడాదిలో రాజ్యసభ నిర్వహణ గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభలో శాసనపరమైన సగటు వార్షిక పనితీరు పెరగడం, అదే విధంగా అనేక కీలకమైన బిల్లులు ఆమోదం పొందడం సంతృప్తిని అందించిందని తెలిపారు. గత మూడేళ్ళలో రాజ్యసభ శాసనపరమైన వార్షిక సగటు పని తీరు 63 శాతం పెరగగా, 249 మరియు 250వ సెషన్లలో ఇది నూరుశాతం సగటును నమోదు చేసిందన్నారు. ఈ కాలంలో రాజ్యసభలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆయన, ముఖ్యమైన బిల్లుల మీద సమగ్ర చర్చకు అవకాశం లభించిందని తెలిపారు. రాజ్యసభ కమిటీల సమావేశాలకు హాజరు శాతం మొదటిగా సారిగా 50 శాతాన్ని దాటడం ఆశించదగిన పరిణామమన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp