బీజేపీ వైపు వీర‌శివ చూపు

By Sodum Ramana 18-11-2019 03:31 PM
బీజేపీ వైపు వీర‌శివ చూపు

క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీర‌శివారెడ్డి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. క‌మ‌లాపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర‌శివ 2009లో చివ‌రిగా ప్రాతినిథ్యం వ‌హించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్క‌డ వాలిపోతార‌నే పేరున్న వీర‌శివ‌కు అదే మైన‌స్‌గా మారింది.

2014లో రాష్ర్ట విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని భావించిన వీర‌శివ‌, అక్క‌డి నుంచి టీడీపీలో చేరారు. అయితే టికెట్ ద‌క్క‌క‌పోవ‌డం, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వీర‌శివ అప్ప‌ట్లో పెద్ద‌గా బాధ‌ప‌డింది లేదు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావ‌డంతో త‌న ప‌నులు చ‌క్క‌దిద్దుకున్నారు. క‌డ‌ప స‌హ‌కార బ్యాంక్ చైర్మ‌న్‌గా వైసీపీ నేత తిరుపాల్‌రెడ్డిని అక్ర‌మంగా దింపి త‌న కొడుకు అనిల్‌ను ఆ సీట్లో కూర్చోపెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వీర‌శీవ వ్య‌వ‌హ‌రించిన తీరు అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలైంది.

అంతేకాకుండా త‌ర‌చూ వైఎస్ జ‌గ‌న్‌ను, ఆయ‌న కుటుంబాన్ని వీర‌శివ ప‌దేప‌దే వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శిస్తూ వ‌చ్చారు. ఎప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ సీఎం కాలేర‌ని, ఆయ‌న‌కు డ‌బ్బు, ప‌ద‌వీ వ్యామోహ‌మ‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చాయి. క‌మ‌లాపురం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నం చేశారు. చివ‌రికి టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో అసంతృప్తికి గుర‌య్యారు.

రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌ ద్వారా ప్రొద్దుటూరు టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. ఆ ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించ‌లేదు. అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీగా చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇవ్వ‌డంతో అఇష్టంగానే టీడీపీ అభ్య‌ర్థి పుత్తా న‌ర‌సింహారెడ్డికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.అయితే ఎన్నిక‌ల‌కు ఒక్క‌రోజు ముందు వీర‌శివ మ‌న‌సు మార్చుకున్నారు. క‌మ‌లాపురం వైసీపీ అభ్య‌ర్థి ర‌వీంద్ర‌నాథ‌రెడ్డితో పాటు క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థి అవినాశ్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. త‌న అనుచ‌రుల‌ను వైసీపీకి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల అనంత‌రం అవినాశ్‌రెడ్డి, ర‌వీంద్ర‌నాథ‌రెడ్డితో పాటు ఇత‌ర నాయ‌కులు వీర‌శివాను క‌లిశారు.

ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి రావ‌డంతో వీర‌శివారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. వైఎస్ జ‌గ‌న్ వ‌ల్లే రాష్ర్టాభివృద్ధి జ‌రుగుతుంద‌ని, మ‌రీ ముఖ్యంగా వెనుక‌బ‌డిన క‌డ‌ప ఎంతో ప్ర‌గతి సాధిస్తుంద‌ని ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో చెప్పారు. వైఎస్ జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వచ్చిన త‌ర్వాత వైసీపీలో చేరుతాన‌ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇదంతా రెండుమూడు నెల‌ల క్రితం మాట‌.

ఆ త‌ర్వాత ఏమైందోకానీ జ‌గ‌న్‌ను వీర‌శివ క‌ల‌వ‌డం జ‌ర‌గ‌లేదు. దీంతో పార్టీలో చేరే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాలేదు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతుండ‌టం, మ‌రోవైపు త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రానుండ‌టంతో ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల వాతావ‌ర‌ణ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం ఊపందుకుంటున్నా వీర‌శివ‌కు ఎక్క‌డ బ్రేకులు ప‌డ్డాయో తెలియ‌డం లేదు. ముఖ్యంగా త‌మ కుటుంబంపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన వీర‌శివ‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు జ‌గ‌న్ ఏ మాత్రం అంగీక‌రించ‌లేద‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో త‌న స‌న్నిహితుడైన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ ద్వారా ఆ పార్టీలో చేరేందుకు పావులు క‌దుపుతున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు త‌న స‌న్నిహితుల‌కు కూడా వీర‌శివ స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. అది ఎప్పుడు, ఎలా, ఎక్క‌డ అనేదే తేలాల్సి ఉంది. బీజేపీలో చేరిక‌కు మాత్రం నిర్ణ‌యం తీసుకున్న‌దైతే నిజ‌మేన‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. 

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News