ప్ర‌మాణాల పాలిటిక్స్ ..

By Kalyan.S Jan. 13, 2021, 07:36 am IST
ప్ర‌మాణాల  పాలిటిక్స్ ..

తూర్పుగోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌రిగిన ప్ర‌మాణాల పాలిటిక్స్ ఓ రేంజ్ లో హిట్ అయింది. ఎమ్మెల్యే సూర్య‌నారాయ‌ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. అంతేకాదు తాము ఎలాంటి అవినీతి చెయ్యలేదని బిక్కవోలు గణపతి ఆలయంలో స‌తీస‌మేతంగా ఎమ్మెల్యే ప్ర‌మాణం చేస్తే.. మాజీ ఎమ్మెల్యే మాత్రం ఆయ‌నొక్క‌రే ప్ర‌మాణం చేసిన విష‌యం తెలిసిందే.
ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి భూ క‌బ్జాల‌కు పాల్ప‌డ్డారంటూ ‌విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్ర‌మాణం స‌వాల్ విసిరారు. వెల‌గ‌పూడి చేసిన ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధారాల‌తో స‌హా ప్ర‌మాణం చేయ‌డానికి ఆల‌యానికి వ‌చ్చారు. ఆరోప‌ణ‌లు చేసిన వెల‌గ‌పూడి వెన‌క‌డుగు వేశారు.

అనంత‌రం విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ మంతెన స‌త్య‌నారాయ‌ణ‌.. క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేదంటూ ఒట్టు వేయ‌లేద‌ని మంత్రికి స‌వాల్ విసిరారు. అవంతి దీనికి సిద్ధ‌మా అని ప్ర‌శ్నించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ కూడా ప్ర‌మాణాల పాలిటిక్స్ మొద‌లెట్టారు. ఆయ‌న ఏకంగా ముఖ్య‌మంత్రికే స‌వాల్ విసిరారు. సింహాద్రి అప్ప‌న్న ఆల‌యానికి వ‌చ్చిన త‌మ‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని ప్ర‌మాణం చేయాల‌ని అన్నారు. దీనికి వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చారు. తేదీ, సమయం చెప్తే సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తామని, ఆధారాల‌తో నిరూపిస్తామ‌ని ప్ర‌తి స‌వాల్ విసిరారు. కానీ.. లోకేష్ ఇప్ప‌టి వ‌ర‌కూ దీనిపై స్పందించ లేదు.
టీడీపీ జిల్లా అధికార ప్ర‌తినిధి నందం సుబ్బ‌య్య హ‌త్య‌కు సంబంధించి ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ప‌ట్ట‌ణంలోని కొట్టాల‌లోని చౌడ‌మ్మ ఆల‌యంలో ప్ర‌మాణం చేశారు. నందం సుబ్బ‌య్యతో త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు. చౌడమ్మ తల్లి పాదాల సాక్షిగా చెబుతున్నా.. తానేమైనా తప్పుగా చెప్పి ఉంటే అమ్మవారి శిక్షకు గురౌతానని ఎమ్మెల్యే అన్నారు.

ఇలా.. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ప్ర‌మాణాల పాలిటిక్స్ పార్ట్ లు పార్ట్ లుగా కొన‌సాగుతూనే ఉన్నాయి. బాహుబ‌లి మూవీ కూడా రెండు పార్ట్ ల‌తోనే ముగిసింది. ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌మాణాల పాలిటిక్స్ మాత్రం ఎన్ని భాగాలైనా కొన‌సాగేలా క‌నిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు నాయకులు సవాళ్లు చేసుకోవడం మామూలే అయినా.. ఇలా.. దేవుళ్ల ముందుకువచ్చి.. ప్రమాణాలు చేసుకోవడం.. అనేది లేదు. ఏదైనా ఉంటే మాటల వరకే పరిమితమయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో ఈ ప్రమాణామాల పాలిటిక్స్ పెరిగిపోయాయి.

తాజాగా విశాఖ జిల్లా ఎస్సీ నియోజకవర్గం పాయకరావు పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ప్రమాణాల రాజకీయం తెరమీదికి వచ్చింది. గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన గొల్ల బాబూరావు.. విజయం సాధించారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి 2014లో విజయం సాధించిన టీడీపీ నాయకురాలు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితల మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్ధం సాగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనిత.. పట్టుబట్టి మళ్లీ పాయకరావుపేట ఇంచార్జ్ పీఠాన్ని దక్కించుకున్నారు.
వాస్తవానికి ఆమెకు పాయకరావుపేట టీడీపీలో పెద్దగా పట్టులేదు. నియోజకవర్గంలో ఉండరని తమను పట్టించుకోరని.. గత ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనలు చేయడంతో చంద్రబాబు ఆమెను కొవ్వూరు మార్చారు. అయితే.. మళ్లీ ఇక్కడకు వచ్చిన అనిత.. పట్టు పెంచుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా గొల్ల బాబూరావుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాబూరావు.. తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని.. ఇటీవల అనిత ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పేదలకు ఇళ్ల పథకంలో లబ్ధి దారుల నుంచి లంచాలు తీసుకున్నారని దుయ్యబట్టారు.

అనిత కామెంట్లపై అంతే వేగంగా స్పందించిన గొల్ల బాబూరావు.. ఎవరు అవినీతికి పాల్పడ్డారో.. టీడీపీ నేతలను అడిగితే.. చెబుతార ని.. ప్రతివిమర్శలు గుప్పించారు. అంతేకాదు.. అవినీతి కారణంగా గత ఎన్నికల్లో నియోజకవర్గానికి దూరం అయ్యారంటూ.. వ్యంగ్యాస్త్రాలు సైతం సంధించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య తీవ్ర వివాదం రగులుకుంది. ఈ నేపథ్యంలో తనపై చేసిన అవినీతి ఆరోపణలు తప్పని.. తాను నిజాయితీగా ఉన్నానని ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. గొల్ల బాబూరావు సవాల్ చేశారు. దీనికి అనిత కూడా సిద్ధమయ్యారు. అయితే.. ఇంకా దీనిపై డేట్ ఫిక్స్ కాలేదు. ఏడాదిన్న‌ర కాలంగా ఏపీలో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దేవుళ్లు, దేవాల‌యాల చుట్టూనే జ‌రుగుతుండ‌డం విచార‌క‌రం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp