మహిళను అవమానించిన చింతకాయలకు టిడిపి మహిళా అధ్యక్షురాలి సపోర్టా ?

By Phani Kumar Jun. 22, 2020, 01:40 pm IST
మహిళను అవమానించిన చింతకాయలకు  టిడిపి మహిళా అధ్యక్షురాలి సపోర్టా ?

తెలుగుదేశంపార్టీలో విచిత్రమైన పరిస్ధితులు పెరిగిపోతున్నాయి. నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ తోట కృష్ణవేణిని అందరి ముందు దూషించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది. నర్సీపట్నం మున్సిపల్ హాలులో తాత లత్సా పాత్రుడి ఫొటోను తీసి ఛైర్మన్ చాంబర్లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే సమావేశం హాలులో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి కాబట్టి.

విషయం తెలియగానే అయ్యన్నపాత్రుడు నేరుగా కమీషనర్ దగ్గరకు వెళ్ళి నోటికొచ్చినట్లు తిట్టారు. ఫొటోను ఎందుకు ఛైర్మన్ చాంబర్లో పెట్టింది కమీషనర్ వివరించింది. రెనోవేషన్ పనులు పూర్తికాగానే మళ్ళీ ఫొటోను సమావేశం హాలులో పెట్టేస్తామని చెప్పినా వినకుండా ’చెప్పినట్లుగా ఫొటోను హాలులో పెట్టకపోతే బట్టలూడదీసి కొడతా’నంటూ దూషించాడు. దాంతో అవమానంగా భావించిన కమీషనర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కమీషనర్ ఫిర్యాదుతో పోలీసులు అయ్యన్నపై నిర్భయ కేసు పెట్టారు. దాన్నే అనిత తప్పుపడుతోంది. అయ్యన్నపాత్రుడి మీద కేసు పెట్టటం కాదని ముందు శాసనమండలి టిడిపి సభ్యులపై దాడులు చేసిన మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ పై కేసులు పెట్టాలంటూ విచిత్రమైన వాదన మొదలుపెట్టింది. అంటే మహిళా కమీషనర్ ను అయ్యన్నపాత్రుడు అందరిముందు అవమానించినా సాటి మహిళగా కూడా అనిత బాధపడటం లేదు. తప్పుని తప్పుగా చెప్పటం లేదు.

గతంలో ఎంఆర్వో వనజాక్షిని అందరి ముందు జుట్టుపట్టుకుని కొట్టిన చింతమనేని ప్రభాకర్ విషయంలో కూడా టిడిపి మహిళా నేతలు ఇలాగే వ్యవహరించారు. బహిరంగంగా మహిళా ఎంఆర్వోను తమ ఎంఎల్ఏ కొట్టినా అప్పటి మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత లాంటి వాళ్ళు కనీసం నోరు కూడా విప్పలేదు. ఇపుడు మహిళా కమీషనర్ విషయంలో మహిళా కమీషన్ స్పందించి అయ్యన్నను అరెస్టు చేయాలని అనగానే అనితకు కోపం వచ్చేసింది. అంటే చింతకాయల సాటి మహిళలను ఎంతగా అవమానించినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునేందుకు లేదనే అనిత చెప్పటమే విచిత్రంగా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp