TRUTH Social: ట్రంప్ సొంత సోషల్ మీడియా.. ట్రూత్ సోషల్

By Ramana.Damara Singh Oct. 21, 2021, 05:45 pm IST
TRUTH Social: ట్రంప్ సొంత సోషల్ మీడియా.. ట్రూత్ సోషల్

వివాదాస్పద నిర్ణయాలకు, వ్యాఖ్యలకు పేరొందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సొంతంగా సోషల్ మీడియా ప్లాటుఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. బహుళ ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా యాప్ లు ట్విటర్, ఫేస్ బుక్ లకు ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ఆ రెండు సంస్థలు తన ఖాతాలను బ్యాన్ చేయడంతో.. వాటిపై కసితో ఆయన ఏకంగా కొత్త యాప్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. తన కొత్త ప్లాటుఫారం పేరు ట్రూత్ సోషల్ అని ప్రకటించారు.

వచ్చే నెలలో పరిమితంగా అందుబాటులోకి ట్రూత్ సోషల్ యాప్ ను యాపిల్ యాప్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం దీని ప్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ట్రంప్ సొంత వ్యాపార సంస్థ అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ గ్రూప్ విలీనం తర్వాత చేపడుతున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. కొత్త సంస్థకు స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీ (ఎస్పీ ఏసీ)గా నామకరణం చేశారు. దీని ద్వారా లాంచ్ చేసే ట్రూత్ సోషల్ యాప్ వచ్చే నెల నుంచి ఎంపిక చేసిన కొంతమందికి అందుబాటులోకి వస్తుంది. 2023 నాటికి అమెరికా అంతటా దీని సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎందుకు బ్యాన్ చేశారు.. 

అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించడమే పెద్ద విశేషం. ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని కాపిటల్ హిల్స్ పై దాడులు జరిగిన సందర్బంగా ట్రంప్ తన ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల ద్వారా రెచ్చగొట్టేలా ఉన్న పోస్టులు పెట్టారని ఆ రెండు సంస్థలు ఆరోపించాయి. దానిపై హెచ్చరించిన ట్రంప్ లెక్క చేయకపోవడంతో ఆయన ఖాతాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ట్రంప్ ఖాతాను ట్విటర్ శాశ్వతంగా బ్యాన్ చేయగా, ఫేస్ బుక్ 2023 జనవరి వరకు నిషేధించింది. దాంతో పది నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ట్రంప్ చివరికి సొంత సోషల్ మీడియా ప్లాటుఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు.

Also Read : Punjab Congress Siddu - సీఎం ఎవరైనా.. సిద్ధూ తీరు అంతేనా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp