UP Elections - యూపీ పోరు.. పార్టీల జోరు..!

By Kalyan.S Dec. 09, 2021, 10:15 am IST
UP Elections - యూపీ పోరు.. పార్టీల జోరు..!

వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అత్యంత ప్ర‌ముఖ‌మైన‌ది. 403 స్థానాలకు వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అతిపెద్ద రాష్ట్రం కావ‌డం ఒక ఎత్త‌యితే.. దేశ రాజ‌కీయాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌గ‌ల శ‌క్తివంత‌మైన‌ది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ రాజకీయ వేడి రగులుతోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండడంతో అక్కడ విజయంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. అక్కడి అధికార బీజేపీతో పాటు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) , బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ),కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా ఎన్నికల రేసులో గెలవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలు రంగంలోకి దిగాయి. దీంతో అక్కడ ఇప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. గత ఎన్నికల్లో భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మరోసారి ముఖ్యమంత్రి యోగీ సారథ్యంలో విజయంపై కన్నేసింది. సర్వేల ఫలితాలు అంచనాలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఆపరేషన్ యూపీ ప్రారంభించింది. ఆ ఎన్నికల కోసం రాష్ట్రంలో కేంద్ర మంత్రులను ఇంఛార్జీలుగా నియమించింది. రీజియన్ల వారీగా ప్రచార కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని ప్రారంభించింది.

రాష్ట్రంలో అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అస్త్రాలకు పదును పెడుతున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించినప్పటికీ తన పార్టీకి విజయాన్ని అందించేందుకు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ విషయాన్ని ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి కూడా అధికారికంగా వెల్లడించారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఎస్పీ,ఆర్ఎల్డీ కలిసి పోటీ చేయడం ఖాయమైంది. కానీ ఇంకా సీట్ల సర్దుబాటుపై మాత్రం నిర్ణయం తీసుకోలేదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన జయంత్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు విడిచిన రైతుల కోసం స్మారకాన్ని కట్టిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగేందుకే మొగ్గు చూపుతోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో దింపుతామని యూపీ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్న ప్రియాంక గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు అధికార బీజేపీతో పాటు బీఎస్పీ కూడా ఒంటరిగానే పోటీ చేయనుంది. ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా టీఎంసీ తరపున అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలున్నాయి. ఇక ఎంఐఎం కూడా తన సత్తా చాటాలని చూస్తోంది. కాగా, సమాజ్‌వాది పార్టీతో తమ పార్టీకి పొత్తు ఉంటుందని ప్ర‌క‌టించిన ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఎన్ని సీట్ల‌లో పోటీ అనేది వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని మాత్రం ధీమా వ్యక్తం చేశారు. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp