Priyanka Gandhi - ప్రతిజ్ఞా యాత్రలు.. హామీల మూటలు

By Ramana.Damara Singh Oct. 24, 2021, 07:30 pm IST
Priyanka Gandhi - ప్రతిజ్ఞా యాత్రలు.. హామీల మూటలు

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా ఉత్తరప్రదేశ్‌లో గత వైభవాన్ని తిరిగి పొందేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇప్పటికే ఎన్నికల రాజకీయాలు ఊపందుకున్నాయి.అధికార బీజేపీ,ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీతో పాటు బీఎస్పీ,కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.గత ఎన్నికల్లో కేవలం ఏడు సీట్లే గెలుచుకుని చతికిల పడిన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపి..ప్రజల్లో పార్టీ చొచ్చుకుపోయేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది.రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇంఛార్జి బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు లఖింపూర్‌ ఖేరి వంటి ఘటనలను సొమ్ము చేసుకుంటూనే మరోవైపు రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుడుతూ.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రియాంక జోరుతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత హుషారు కనిపిస్తోంది. ఆమెతోపాటు పార్టీ మొత్తం ప్రచారంలో పరుగులు తీస్తోంది.

మూడు ప్రాంతాల్లో యాత్రలు ప్రారంభం

ప్రచార వ్యూహంలో భాగంగా ఇంతకుముందు ప్రకటించిన విధంగా సుమారు 12 వేల కిలోమీటర్ల ప్రతిజ్ఞాయాత్రలను ప్రియాంక ప్రారంభించారు. ప్రాంతాలవారీగా నిర్వహించే ఈ యాత్రల్లో మొదటి దాన్ని శనివారం అవద్ ప్రాంతంలోని బారాబంకిలో ప్రారంభించారు. బారాబంకి, బుందేల్ ఖండ్ జిల్లాల మీదుగా ఈ యాత్ర ఝాన్సీ వరకు సాగుతుంది. ఇదే సమయంలో వారణాసి,షహరన్‌పూర్‌ ల నుంచి మరో రెండు యాత్రలు ప్రారంభమయ్యాయి.నవంబర్ ఒకటో తేదీ వరకు ఇవి కొనసాగుతాయి.దీపావళి తర్వాత నాలుగో యాత్ర మొదలవుతుంది.కాగా రైతులకు మద్దతుగా ఇంతకుముందే ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహించి సత్తా చాటిన ప్రియాంక..ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్థంతి సందర్బంగా ఈ నెల 31న గోరక్ పూర్‌లో రెండు లక్షల మందితో ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రజల మెడలో వరాల మాలలు

ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రియాంక హామీల మూటలు విప్పి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆమె మహిళలు,యువత,రైతులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పలు ఎన్నికల హామీలను బారాబంకిలో ప్రతిజ్ఞ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని,కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చారు.రైతుల రుణాలు మాఫీ చేస్తామని గోధుమ, ధాన్యం ఉత్పత్తులకు క్వింటాలుకు రూ.2500, చెరుకు కు రూ.400 మద్దతు ధర ఇస్తామని ఆమె ప్రకటించారు.విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తామని, కరోనా బాధిత కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీల వర్షం కురిపించారు.మరోవైపు 12వ తరగతి చదివే బాలికలకు స్మార్ట్ ఫోన్లు, డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని వాగ్దానం చేశారు. వీటన్నిటితో పాటు హమ్ వచన్ నిభాయేంగే.. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం అని ప్రియాంక నినదిస్తున్నారు.

Also Read : Congress Membership - Rules : కాంగ్రెస్ సభ్యత్వం ఇక కష్టమే..! పాత వారి పరిస్థితేమిటీ..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp