యూపీ ఎన్నికలు- బాధితులు, ఉద్యమకారులే కాంగ్రెస్ అభ్యర్థులు

By Ramana.Damara Singh Jan. 13, 2022, 08:30 pm IST
యూపీ ఎన్నికలు- బాధితులు, ఉద్యమకారులే కాంగ్రెస్ అభ్యర్థులు

ఉత్తరప్రదేశ్‌లో మూడు దశాబ్దాలుగా దూరమైన అధికారాన్ని అందుకునేందుకు కాంగ్రెస్ మహిళలనే సైనికులుగా నిలబెడుతోంది. హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ దళపతిగా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ మహిళా సమస్యలనే అస్త్రాలుగా సంధిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని ముందస్తు సర్వేలు అంచనా వేస్తున్నా ప్రియాంక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందు ప్రకటించిన మహిళా వ్యూహాంతోనే ముందుకు వెళుతున్నారు. గురువారం ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వారిలో 50 మంది మహిళలే ఉండటం విశేషం. మహిళా అభ్యర్థుల్లో పలువురు బాధిత కుటుంబాల సభ్యులు, ఉద్యమకారులు, సామాన్యులు ఉన్నారు.

ఉన్నావ్ బాధితురాలి తల్లికి అవకాశం

మహిళలు రాజకీయ అధికారం సాధించాలన్న ఉద్దేశంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని ప్రియాంక గతంలోనే ప్రకటించారు. 403 నియోజకవర్గాలు ఉన్న యూపీలో ప్రియాంక చెప్పిన దాని ప్రకారం సుమారు 160 మంది మహిళా అభ్యర్థులను పోటీ చేయించాలి. అందుకు అనుగుణంగా తొలి జాబితాలో 50 మందికి చోటు కల్పించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు ఉన్నావ్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడం విశేషం. అలాగే ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుపాలైన సదాఫ్ జాఫర్‌కు లక్నో సెంట్రల్ టికెట్ ఇచ్చారు. సోన్‌భద్ర ఊచకోత ఘటనకు వ్యతిరేకంగా గళం విప్పి ఉద్యమించిన మహిళకు ఉమ్భా నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టారు.

ఇక ఆశావర్కర్‌గా పని చేస్తూ గౌరవ వేతనాల పెంపు కోసం పోరాడిన పూనమ్ పాండేకు షాజహాన్ పూర్ టికెట్ కేటాయించారు. రాంపూర్ ఖాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరాధన మిశ్రాకు మళ్లీ అవకాశం ఇచ్చారు. కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షిద్ సతీమణి లూయిస్ ఖుర్షిద్ ఫరూకా బాద్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గిరిజన నాయకుడు రామ్ రాజ్ గోండ్‌ను రాష్ట్రంలోని పొంగ స్థానం నుండి బరిలోకి దింపారు. ఈ జాబితాలో పలువురు మహిళా జర్నలిస్టులు, సామాన్యులు, కాంగ్రెస్‌కు అంకితమై ఏళ్ల తరబడి కష్టాలు ఎదుర్కొంటున్న వారికి చోటు కల్పించామని ప్రియాంక గాంధీ చెప్పారు.

మహిళా మంత్రం ఫలించేనా

ఉత్తరప్రదేశ్ ద్వారా దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నామని ప్రియాంక వ్యాఖ్యానించారు. మిగిలిన అభ్యర్థుల ఎంపికలోనూ మహిళకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. 40 శాతం మహిళలు, 40 శాతం యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ రెండు వర్గాలను ఆకట్టుకునేలా ఆమె ఇప్పటికే పలు హామీలు ఇచ్చారు. 12వ తరగతి విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని వాగ్దానం చేశారు. మహిళా శక్తిని చాటేలా ‘లడ్కీ హూన్‌..లడ్‌సక్తీ హుం' అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రియాంక దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు విరివిగా మారథాన్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కానీ ఇతర పార్టీలు నిలబెట్టే బలమైన అభ్యర్థులు, వారి ధన రాజకీయాల ముందు కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా.. మహిళా సైన్యం నెగ్గుకురాగలదా.. అన్న ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలతోనే సమాధానం లభిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp