నా పాలన చూడండి.. ఓట్లేయండి.. ప్రజల ముందుకు సరికొత్తగా యోగీ..

By Thati Ramesh Sep. 19, 2021, 05:51 pm IST
నా పాలన చూడండి.. ఓట్లేయండి.. ప్రజల ముందుకు సరికొత్తగా యోగీ..

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయభేరీ మోగించాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టు కార్యాచరణను రూపొందిస్తుంది. సీఎం యోగి హయాంలో యూపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తుంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతిభద్రతల గురించి ఇంటింటికి తిరిగి వివరించేందుకు ప్లాన్ రెడీ చేసింది.

యోగీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 54 నెలలు పూర్తైన సందర్భంగా రాష్ట్రంలో 27,700 శక్తి కేంద్రాల్లో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ప్రభుత్వం సాధించిన విజయాలు ఏకరువు పెట్టారు. అలాగే సెప్టెంబర్ 20నుంచి వారం పాటు బీజేపీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించనున్నారు.

ప్రచారం ప్రారంభం..

ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై సీఎం యోగి ఓ బుక్ లెట్ విడుదల చేశారు. గత ప్రభుత్వాల హయాంలో యథేచ్ఛగా అల్లర్లు జరిగేవన్న యోగీ.. తమ ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు ప్రాధాన్యమిచ్చిందన్నారు. బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్ అల్లర్ల రహిత రాష్ట్రంగా మారిందన్నారు. నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకున్న దాఖలాలు లేవని ప్రకటించారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీలేకుండా వ్యవహరించదన్న యోగీ.. కుల, మత, ప్రాంతీయ పక్షపాతం చూపకుండా నేరస్తులు, మాఫియా పట్ల చట్టానికి పరిధిలోనే కఠినంగా వ్యవహరించామని వివరించారు. ఆక్రమణలకు గురైన 1800 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వం ఆస్తులు స్వాధీనం చేసుకున్నామన్న యూపీ సీఎం.. అక్రమ కట్టడాలను కూల్చివేశామన్నారు.

Also Read : పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

గడిచిన నాలుగున్నరేళ్లలో 42 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చామని పేర్కొన్న యోగీ ఆదిత్యానాథ్ .. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన బాధితులకు 24 గంటల్లోనే నష్టపరిహారం అందజేశామన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక విధానం ద్వారా యువతకు నాలుగున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వ సుపరిపాలన కారణంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ ’లో దేశంలోనే యూపీ రెండో స్థానంలో నిలవడం మంచి పరిణామమన్నారు.

ప్రస్టేజ్ ఇష్యూ...

యూపీలో మళ్లీ గెలిచి తన సత్తా ఎంటో ప్రతిపక్షాలతో పాటు బీజేపీ అగ్రనేతలకు చూపాలని యోగి భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను బీజేపీ మార్చింది. ఉత్తరాఖండ్, అసోం, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల సీఎం లను మార్చిన బీజేపీ.. యోగి జోలి కూడా వెళ్ళింది. ఐతే ఆరెస్సెస్ లో యోగికి ఉన్న పట్టుతో మోదీ , అమిత్ షా ల ప్లాన్ లు పారలేదు.

యోగికి దేశవ్యాప్తంగా మోదీకి ఉన్నంత చరిష్మా ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన ప్రచారానికి వెళతారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ప్రచారానికి వెళ్లి బీజేపీ అభ్యర్ధుల విజయానికి దోహదపడ్డారు. మోడీ రిటైర్మెంట్ తర్వాత ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు అమిత్ షా, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యానాథ్ పేర్లు సమాధానంగా వస్తాయి. అయితే మోడీ స్థాయిలో ఓటర్లను ఆకర్షించగల నేత యోగి ఆదిత్యానాథ్ మాత్రమే అని చెప్పవచ్చు. యోగీకి వయసు మరో ప్లస్ పాయింట్. అతని వయస్సు ప్రస్తుతం 49 ఏళ్లు. దీంతో మిగతా పోటీదారులతో పోల్చుకుంటే అతనే బెటర్ ఛాయిస్ అవుతారనడంలో డౌట్ లేదు.

Also Read : శివసేన,బీజేపీ మధ్య మళ్లీ స్నేహ సంకేతాలు...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp