నేను దేశ ద్రోహం చేయలేను...ఆ నివేదిక బయటపడితే కల్లోలమేనా!

By Voleti Divakar Nov. 28, 2020, 04:40 pm IST
నేను దేశ ద్రోహం చేయలేను...ఆ నివేదిక బయటపడితే కల్లోలమేనా!

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాసమస్యలపై తాను స్పందిస్తూనే ఉంటానని, తప్పులను నిలదీస్తూనే ఉంటానని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. లేకపోతే దేశ ద్రోహం చేసినట్టేనని పేర్కొంటూ దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. పోలవరం ప్రాజెక్టు, విభజన హక్కులపై పట్టువదలని విక్రమార్కుడిగా కృషిచేస్తున్న ఉండవల్లి విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర విభజన హామీల అమలుపై నీతి ఆయోగ్ ప్రధాని నరేంద్రమోడీకి ఒక నివేదికను సమర్పించిందని చెప్పారు.

అయితే ఆర్ టి ఐ ప్రకారం ఆలేఖ సారాంశాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే సెక్షన్ 82 ప్రకారం ఆలేఖలోని వివరాలు వెల్లడిస్తే దేశంలో అల్లకల్లోలం రేగుతుందని నీతి ఆయోగ్, ప్రధాని కార్యాయం పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి ఎద్దేవా చేశారు. అసలు ఆ నివేదికలో ఏముందో తెలుసుకోవాల్సిన హక్కు, బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల విషయంలో నీతి ఆయోగ్ లేఖ రాయడం పార్లమెంటు సాంప్రదాయాలను తుంగలో తొక్కినట్టేనన్నారు. పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలోని బిల్లులోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈనేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ లేఖ రాసే అధికారం నీతి ఆయోగ్ కు లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం గొప్పదా... టిడిపి హయాంలో చేసిన కేబినెట్ తీర్మానం గొప్పదా అని ప్రశ్నించారు. అంచనా వ్యయాన్ని సవరించాలంటే మళ్లీ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గడువులోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే నాబార్డు మంజూరు చేసిన నిధులు రుణంగా మారిపోతాయన్న నిబంధన ఉందని గుర్తుచేశారు.

రాష్ట్ర విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు హైకోర్టులో వేసిన పిల్లో తాను ఇంప్లీడయ్యానని, తనను ఈకేసులో పార్టీగా చేరుస్తూ నెంబర్ కూడా కేటాయించినట్లు ఉండవల్లి చెప్పారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే విభజన హామీలు నెరవేరే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం చేసిన చట్టాన్నే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర విభజన సమస్యలపై సంధించిన లేఖలకు టిడిపి, వైసిపి ప్రభుత్వాలు సక్రమంగా స్పందించకోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సందర్శన విషయంలో గత ప్రభుత్వం అతివృష్టిగా రూ. 400కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం అనావృష్టి వచ్చినట్లు వ్యవహరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆసియాలోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి విషయంలో అధిగమించే దేశం, రాష్ట్రం ఉండవని ఉండవల్లి చెప్పారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp