సీఎం లేఖ ఇదే మొదటిసారి కాదు.. మిలార్డ్ అనే విలువను కాపాడాలంటున్న ఉండవల్లి

By Raju VS Oct. 17, 2020, 01:59 pm IST
సీఎం లేఖ ఇదే మొదటిసారి కాదు.. మిలార్డ్ అనే విలువను కాపాడాలంటున్న ఉండవల్లి

న్యాయవ్యవస్థ మీద లేఖలు రాయడం జగన్ తో మొదలయ్యిందని కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్రంలో సాగుతున్న పరిణామాలపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దామోదరం సంజీవయ్య కాలంలోనే న్యాయమూర్తుల మీదే ఫిర్యాదులు చేసిన అనుభవాలున్నాయన్నారు. వైఎస్సార్ కాలంలోనూ కోర్టులతో పలు వివాదాలు జరిగాయన్నారు. ఎన్టీఆర్ హయంలో కూడా తగాదాలు పడిన అనుభవం ఉందని తెలిపారు.

మార్గదర్శి కేసులో ఎప్పుడు ఏం జరిగిందన్నది తెలియకుండా పరిణామాలు జరిగాయన్నారు. తెలంగాణా అసెంబ్లీ రద్దయిన సమయంలో కేసు కొట్టేసిన విషయాన్ని కోర్టులను మేనేజ్ చేయడంతో పాటుగా ప్రెస్ ని కూడా మేనేజ్ చేసినట్టు వ్యాఖ్యానించారు. ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి రోజున కొట్టేసినట్టు ఆ తర్వాతే తనకు తెలిసిందన్నారు. జడ్జీల నియామకం విషయంలో కూడా ఎటువంటి అర్హత లేని వాళ్లు వచ్చేస్తున్నారన్నారు. గతంలో తాను వ్యాఖ్యానించినట్టు మాది హస్తం గుర్తు, న్యాయవాదులది పాదం గుర్తు అన్నట్టుగా చెప్పేవాడినని అన్నారు.

చంద్రబాబు హయంలో ఓ సమావేశంలో మహిళా జడ్జి మాట్లాడుతూ టీడీపీ వల్లనే తమకు భవిష్యత్ అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. మిలార్డ్ అంటే గౌరవంగా వ్యవహరించాల్సి ఉన్నా అందుకు భిన్నంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ప్రస్తుత పరిణామాలు జగన్ వర్సెస్ సుప్రీంకోర్ట్ జడ్జి కాదని వ్యాఖ్యానించారు. 1967లో జడ్జి మీద ఎఫ్ ఐ ఆర్ పెట్టిన చరిత్ర ఉందన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు జడ్జి అతీతం కాదని కోర్ట్ చెప్పినట్టు గుర్తు చేశారు.ఎఫ్ ఐ ఆర్ వల్లనే ఇప్పుడు గాగ్ ఆర్డర్ వచ్చిందని, దాని అవసరం ఏమిటో అంతుబట్టడం లేదన్నారు.

అడ్వొకేట్ జనరల్ మీద ఫిర్యాదు ఇవ్వకూడదా అని ఉండవల్లి నిలదీశారు. కోర్టులు , జడ్జిలు అతీతం కాదని, అందరూ సమానమేనన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం రాజీపడడం వల్లనే కోర్టులు ఏమీ చేయలేని స్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల ఏపీ హైకోర్ట్ చెప్పిన తీర్పులలో ఎల్ నాగేశ్వర రావు బెంచ్ లో తప్ప అన్ని కేసుల్లోనూ హైకోర్ట్ తీర్పులను సమర్థించిన విషయాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. కోర్టులు కేసులలో జాప్యం చేయగలవే తప్ప ప్రభుత్వ నిర్ణయాలు చట్టపరిధిలో ఉంటే కోర్టులు ఏమీ చేయలేవన్నారు.

చంద్రబాబు, జగన్ సహా వివిధ కేసులలో సాగుతున్న విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను సుప్రీంకోర్ట్ సీజేకి లేఖ రాసినట్టు తెలిపారు. కోర్టుల సంఖ్య, బెంచీలు కూడా పెంచాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. జగన్ ప్రస్తావించిన అంశాలపై చర్చ జరగాలన్నారు. వ్యక్తిగత అంశాలుగా పరిగణించకూడదన్నారు. దానికి ఎలాంటి ముగింపు అన్నది న్యాయనిపుణులకు కూడా అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం అందరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్గత విచారణకు సుప్రీంకోర్ట్ ఆదేశాలు ఇవ్వచ్చన్నారు. భూములు కొనుక్కుంటే తప్పేంటీ, దానికి గ్యాగ్ ఆర్డర్ ఏంటని ఉండవల్లి వ్యాఖ్యానించారు. జగన్ బాబాయ్ కేసులో ఇచ్చిన గ్యాగ్ ఎన్నికలకు ముందు జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది నిరూపణ సాధ్యమా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

ప్రస్తుత సంక్షోభాన్ని రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. జగన్ కేసుల్లో చేసిన ఆరోపణలు నేను విశ్వసించడం లేదన్నారు. క్విడ్ ప్రోకో నిరూపించే అవకాశం లేదన్నారు. నిందితుడిగా తేలినా ఇలాంటి కేసుల్లో కేవలం ఫైన్ వేయడమే తప్ప శిక్ష వేయగలిగే అవకాశం లేదన్నారు.

జస్టిస్ రమణ మీద జగన్ చేసిన ఆరోపణల్లో కొత్త లేవన్నారు. జస్టిస్ రమణ గతంలో చంద్రబాబు హయంలో అడ్వొకేట్ జనరల్ గా పనిచేసిన చరిత్ర ఉందన్నారు. చంద్రబాబు సిఫార్సుతోనే ఆయనకు హోదా దక్కి ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి వారి జాబితా చాలామంది ఉన్నారు. వారందరి తోడ్పాటుతోనే చంద్రబాబు కోర్టుల్లో నెట్టుకురాగలుగుతున్నారనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయన్నారు. గతంలో స్వామీ అనే జడ్జ్ తాను రాసిన పుస్తకంలో జస్టిస్ రమణ పై ఆరోణలు చేశారని గుర్తు చేశారు.

కులాల మధ్య విభజన సరికాదన్నారు. కులాల పేర్లతో పత్రికల్లో ఎడిటోరియల్ రాయడం ఆరోగ్యకర వాతావరణం కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను పట్టుకోవడం ఈ ప్రభుత్వ పనికాదంటే ఎలా అని ఉండవల్లి ప్రశ్నించారు. మరింకెవరు పట్టుకుంటారని ఉండవల్లి ప్రశ్నించారు. జస్టిస్ ఎన్ వీ రమణను చీఫ్‌ జస్టిస్ కాకుండా ఆపేందుకు బీజేపీ సహకారం లేకుండా జరగదన్నారు. యూపీఏ దానికి సిద్ధంగా ఉండదని తన అంచనాగా ఉండవల్లి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే రమణ ఇంపీచ్ మెంట్ జరిగుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల పరిస్థితే సందేహంగా మారిన తరుణంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp