పుదుచ్చేరిలో మంత్రిమండలి మంటలు

By Ramana.Damara Singh Jun. 23, 2021, 09:28 am IST
పుదుచ్చేరిలో మంత్రిమండలి మంటలు

మిత్రపక్షాల మధ్య పట్టుదలలు, పంతాలతో తీవ్ర జాప్యం జరిగిన పుదుచ్చేరి మంత్రివర్గ కూర్పు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఇక ప్రమాణ స్వీకారాలే ఆలస్యం అనుకుంటున్న సమయంలో మరో వివాదం ముసురుకుంది. పదవుల విషయంలో పట్టువీడకుండా.. మంత్రిమండలి ఏర్పాటులో జాప్యానికి కారణమైన బీజేపీయే తాజా వివాదానికి కూడా కారణమైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే జాన్ కుమార్ వర్గీయులు మంత్రి పదవి కోసం ఆందోళనలు, నిరసనలకు దిగడంతో మరోసారి మంత్రివర్గ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది.

ఎవరీ జాన్ కుమార్?

మొదట డీఎండీకే పార్టీలో ఉన్న ఏ.జాన్ కుమార్ స్వతహాగా బిజినెస్ మాన్. తర్వాత కాంగ్రెసులో చేరి.. 2016 ఎన్నికల్లో కామరాజ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రభుత్వంపై అసంతృత్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే బీజేపీలో చేరి తనతో పాటు తన కుమారుడు రిచర్డ్స్ జాన్ కుమారుకు కూడా టికెట్లు ఇప్పించుకున్నారు. ఎన్నికల్లో వారిద్దరూ గెలిచారు. ఇప్పుడు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే తాను బీజేపీలో చేరానని ఆయన అంటున్నారు. తీరా ఇప్పుడు మంత్రివర్గ జాబితాలో తన పేరు లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. తనకు మొండి చెయ్యి చూపితే ఊరుకునేదిలేదని స్పష్టం చేస్తున్నారు.

పొత్తులో భాగంగా మంత్రివర్గంలో బీజేపీకి రెండు పదవులు దక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నమశ్శివాయం కు హోమ్ మంత్రి పదవి ఖరారు చేశారు. మరో మంత్రి పదవికి శరవణ కుమార్ ను ఖరారు చేశారు. తన పేరు లేదని తెలుసుకున్న జాన్ కుమార్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల వద్ద పైరవీలు చేస్తుంటే.. పుదుచ్చేరిలో అతని అనుచరులు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి లోనికి చొచ్చుకుపోయారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు చించేశారు. దీనిపై బీజేపీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

జాబితా సిద్ధం చేసిన సీఎం రంగస్వామి

మొన్నటి ఎన్నికల్లో ఎన్ ఆర్ కాంగ్రెస్, బీజేపీలు భాగస్వాములుగా ఉన్న ఎన్డీయే కూటమి 16 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి మే ఏడో తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రిమండలి కూర్పు విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో నెలన్నర రోజులపాటు ప్రతిష్టంభన ఏర్పడింది. తనకు ఉప ముఖ్యమంత్రి, స్పీకరుతో పాటు మూడు మంత్రి పదవులు కావాలని బీజేపీ పట్టుబట్టింది. దానికి సీఎం రంగస్వామి అంగీకరించలేదు. ఇలా ఎవరికి వారు పట్టుదలకు పోవడంతో మంత్రివర్గ ఏర్పాటులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. పలుమార్లు చర్చలు జరిపిన మీదట ఒప్పందం కుదిరింది. బీజేపీకి స్పీకర్ తో పాటు హోమ్, మరో శాఖ ఇవ్వాలని నిర్ణయించారు.

మిగిలిన మూడు మంత్రి పదవులు ఎన్ ఆర్ కాంగ్రెసుకు దక్కుతాయి. స్పీకర్ గా బీజేపీ నేత ఎంబలం సెల్వం ఈ నెల 16నే ఎన్నికయ్యారు. తన కోటా పదవులకు బీజేపీ ఇచ్చిన రెండు పేర్లతో సహా ఐదుగురితో కూడిన మంత్రివర్గ జాబితాను సీఎం రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి పంపారు. ఆమె ఆమోదం లభించిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయించాలనుకున్నారు. ఈలోగా జాన్ కుమార్ రంగంలోకి దిగడంతో బీజేపీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp