రఘురామరాజుకు షాక్ - పిటీషన్ కొట్టివేత

By Raju VS Sep. 15, 2021, 11:50 am IST
రఘురామరాజుకు షాక్ - పిటీషన్ కొట్టివేత

వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు అంశంపై తాను దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు విశ్వాసం లేదని, విచారణను మరో కోర్టుకు బదలాయించాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్టం రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

పలుమార్లు కోర్టులో విచారణ జరిగి, అన్ని వైపుల వాదనలు విన్న తర్వాత.. సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే తీర్పు వచ్చే ఒక్క రోజు ముందు రఘురామ రాజు సీబీఐ కోర్టుపై నమ్మకంలేదనేలా, విచారణను మరో కోర్టుకు బదలాయించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఆయన వైఖరి ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే రఘురామరాజు పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

సాక్షిపై పిటీషన్ తెలంగాణా హైకోర్టుకి బదిలీ

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటీషన్ పై కోర్టు తీర్పు వెలువడకముందే సాక్షి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ ఒకటి వివాదాస్పదమయ్యింది. దానిపై రఘురామకృష్ణం రాజు ఓ పిటీషన్ కూడా దాఖలు చేశారు. కోర్టు ధిక్కారణ కింద పరిగణించాలని ఆయన సీబీఐ కేసులో వేసిన పిటీషన్ పై ఇప్పటికే విచారణ జరిగింది. అయితే తాజాగా ఈ కేసుని తెలంగాణా హైకోర్టుకి బదిలీ చేస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే జగన్ , విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కేసులను సీబీఐ కోర్టు విచారించింది. కానీ తాజాగా విచారణ పూర్తయ్యి, తీర్పు రిజర్వ్ చేసి ఉన్న తరుణంలో విచారణ మరో కోర్టుకి మార్చాలంటూ పిటీషనర్ రఘురామకృష్ణంరాజు కోరారు. దానిని తెలంగాణా హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కోర్టులనే అనుమానిస్తారా అంటూ పిటీషనర్ ని నిలదీసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు సాక్షి కేసులో విచారణని హైకోర్టుకి మారుస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది.

వాస్తవానికి ఇప్పటికే సాక్షి సంస్థ దానిపై వివరణ ఇచ్చింది. ఆ ట్వీట్ తప్పుగా వచ్చిందని, వెంటనే తొలగించామని తెలిపింది. ఆ ట్వీట్ కి కారణమయిన వ్యక్తి కూడా రాజీనామా చేశారని కోర్టుకి తెలిపింది. వ్యక్తిగతంగా జరిగిన తొందరపాటు చర్యగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తప్పుదొర్లిందని అంగీకరించి, వెంటనే సరిదిద్దుకున్న నేపథ్యంలో ఈ కేసులో సాక్షి సంస్థకు పెద్ద సమస్య ఉండకపోవచ్చని ఆ సంస్థ తరుపున వాదిస్తున్న వారు అంచనా వేస్తున్నారు.

అయితే కోర్టు కేసులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజు దానిని కూడా రాజకీయంగా వినియోగించుకునే లక్ష్యంతో పిటీషన్ వేయడం విశేషంగా మారింది. అయితే ఈ కేసు విచారణ మాత్రం తెలంగాణా హైకోర్టుకి మారడంతో అక్కడ ఎలాంటి తీర్పు వెలువడుతుందన్నది ఆసక్తికరమే.

Also Read : రఘురామకృష్ణం రాజు అసలు లక్ష్యం ఏమిటో, కోర్టు మార్పు కోరడానికి కారణమేంటో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp