గ్రేట‌ర్ పై గులాబీ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు

By Kalyan.S Sep. 09, 2021, 10:15 am IST
గ్రేట‌ర్ పై గులాబీ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు

మ‌హాన‌గ‌ర ప‌రిధిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ భారీగా పుంజుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు గ‌ట్టి పోటీయే ఇచ్చింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా ఏకంగా న‌ల‌భై ఎనిమిది స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌ల గ్రేట‌ర్ లో సాగిన బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అధికార పార్టీ అప్ర‌మ‌త్త‌మైన‌ట్లు మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్య‌ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో క‌మిటీల ఏర్పాటుకు సంబంధించి భారీ స్థాయిలో క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాలో గ్రామ‌, మండ‌ల క‌మిటీలు దాదాపు పూర్తి అయ్యాయి. కానీ, గ్రేట‌ర్ లో మాత్రం ఇంకా క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో మూడు జిల్లాలు ఉండ‌డంతో, జిల్లాల వారీగా క‌మిటీలు వేయాలా, గ్రేట‌ర్ మొత్తానికి ఒకే క‌మిటీ వేద్దామా.. అనే సందిగ్ధంలో టీఆర్ఎస్ అధిష్ఠానం ఉంది.

గ్రేట‌ర్ లో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పుడూ లేని విధంగా బస్తీ, కాలనీ, వార్డు, జిల్లా స్థాయి కమిటీలు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం.. టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయిలో కమిటీలు వేయాలనుకోవడం ఇదే ప్రథమం. జిల్లాల్లో గ్రామ, మండల కమిటీల నియామకం దాదాపుగా పూర్తయ్యింది. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌కు సంబంధించి జిల్లాల వారీగా కమిటీలు వేయాలా, గ్రేటర్‌ మొత్తానికి ఒకే కమిటీనా అన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కమిటీల నియామకం ఎలా ఉండాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 డివిజన్లున్నాయి. మహేశ్వరం, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గాల్లో కొంత ఏరియా గ్రేటర్‌ ఆవల ఉంటుంది. పునర్విభజనతో జిల్లాల విస్తీర్ణం భారీగా తగ్గింది. నగరం చుట్టూ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏరియాలు పలు కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో ప్రస్తుతమున్న మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల విస్తీర్ణం తగ్గింది. ఇందులో కొన్ని ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా, మరి కొన్ని అవతల ఉన్నాయి. గ్రేటర్‌ కమిటీ నియమించిన పక్షంలో ఆయా జిల్లాల కమిటీ పరిధి గణనీయంగా తగ్గే అవకాశముంది.

అదే సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండే శివారు డివిజన్ల నేతలకు పొరుగు జిల్లా కమిటీల్లో చోటు దక్కితే ఇబ్బందికరమే అన్న అభిప్రాయాన్ని కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నియామకానికి సంబంధించి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. నగరంలో భారీ కార్యక్రమం నిర్వహించాలంటే గ్రేటర్‌ కమిటీ ఉంటేనే జన సమీకరణకు అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్‌ఎంసీ పరిధి వరకు కమిటీ నియమించవచ్చని కొందరు చెబుతుండగా, జిల్లాల వారీగా కమిటీ ఏర్పాటుకూ అవకాశం లేకపోలేదని మరి కొందరంటున్నారు.

గ్రేటర్‌ కమిటీ ఏర్పాటు చేసిన పక్షంలో మహానగరమంతటా పరిచయాలు ఉన్న, వివాదరహితంగా ఉండే వ్యక్తికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20వ తేదీలోపు బస్తీ, కాలనీ, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తి చేసి, ఆ లోపు జిల్లాల వారీగా కమిటీలు ఉండాలా, గ్రేటర్‌ మొత్తానికా అన్న దానిపై స్పష్టత రావచ్చని ఓ నాయకుడు తెలిపారు. బీజేపీ కూడా గ్రేట‌ర్ విష‌యంలో విభిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. అటు మూడు జిల్లాల వారీగా లేదా, గ్రేట‌ర్ మొత్తానికి ఒక‌టే క‌మిటీ వేయ‌కుండా ఏకంగా ఆరు జిల్లాలుగా గ్రేట‌ర్ ను ప‌రిగ‌ణించింది. ఆ మేర‌కు క‌మిటీల‌కు అధ్య‌క్షుల‌ను నియ‌మించింది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp