టీఆర్ఎస్ లో జెండా పండుగ ఉత్సాహం

By Kalyan.S Sep. 02, 2021, 07:30 am IST
టీఆర్ఎస్  లో జెండా పండుగ ఉత్సాహం

మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు అనుగుణంగా తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఇటీవ‌ల దూకుడు పెంచుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ నిత్యం ప్ర‌జాక్షేత్రంలో ఉంటూ ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌జ‌ల్లో పార్టీకి ఉన్న ఆద‌ర‌ణ ఎక్క‌డా చెక్కు చెద‌ర‌కుండా కాపాడుకుంటున్నారు. పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీనిలో భాగంగానే ఈసారి సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణ‌యించింది. ఆ బాధ్య‌త‌ల‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. దీని కోసం కొద్ది రోజులుగా పార్టీ శ్రేణులతో మాట్లాడుతూనే ఉన్నారు.

జెండా పండుగ పేరుతో గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో టీఆర్ఎస్ జెండాను ఎగిరేలా పార్టీ ప్లాన్ చేసింది. దీని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యవర్గం, సర్పంచులతో ప‌లు ద‌ఫాలుగా టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించింది. పార్టీ శ్రేణులకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేసింది. గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. ఇదే రోజు (సెప్టెంబర్ 2)న ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ చేస్తున్న శంఖుస్థాపన చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో జెండా పండగ విజయవంతానికి ‌స్థానిక నాయ‌క‌త్వం విశేషంగా కృషి చేసింది.

జెండా పండగను విజ‌య‌వంతం చేసి ఆ త‌ర్వాత వెంటనే పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా క‌మిటీల ఏర్పాటు ప్ర‌క్రియ‌కు టీఆర్ఎస్ శ్రీ‌కారం చుట్ట‌నుంది. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు.. అనంత‌రం మండల, పట్టణ కమిటీలను నిర్మాణం పూర్తి చేసేందుకు కేటీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక మరియు జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని ఇప్ప‌టికే తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఆయా కమిటీలలో చోటు ఉంటుంద‌ని అధిష్ఠానం మొద‌టి నుంచీ చెబుతోంది. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కచ్చితంగా 51 శాతం ఉండేలా నిర్దేశించింది. అలాగే, గ్రేటర్‌ హైదరాబాద్‌తో ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. నగరంలోని బస్తీ, డివిజన్‌ కమిటీలు ఏర్పాటు చేయ‌నుంది.

మొత్తంగా జెండా పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించి అనంత‌రం.. భ‌విష్య‌త్ లో విప‌క్షాల నుంచి ఎదుర్కోబోయే స‌వాళ్ల నేప‌థ్యంలో పార్టీ నిర్మాణం ఉండేలా అధిష్ఠానం క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఢిల్లీలో గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కార్యాల‌య శంకుస్తాపన‌లో ఉండ‌గానే, రాష్ట్రంలో ప్ర‌తీ చోటా టీఆర్ఎస్ జెండా రెప‌రెప‌లాడేలా వ్యూహాలు ర‌చించారు. రాష్ట్రస్థాయి నాయకత్వం సమన్వయంతో ప‌ని చేసేలా గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, న‌గ‌ర స్థాయి క‌మిటీల‌కు ఈ మేర‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp