రేవంత్ రెడ్డిలో ఫోన్ ట్యాపింగ్‌ భయం

By Ritwika Ram Jul. 16, 2021, 10:00 pm IST
రేవంత్ రెడ్డిలో ఫోన్ ట్యాపింగ్‌ భయం

రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదన్నట్లుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనా.. గతం ఆయన్ను భయపెడుతోంది. ఫోన్ ట్యాపింగుల వ్యవహారం కలవరపెడుతోంది. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో ఆధారాలతో సహా ఆయన అడ్డంగా దొరికి పోయిన విషయం తెలిసిందే. ఇది జరిగి దాదాపు ఆరేళ్లు దాటిపోయింది. ఇప్పుడు కూడా తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆందోళన చెందుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని రేవంత్ ఆరోపిస్తున్నారు.

అంతర్జాతీయ నేరమట

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా‌ రాష్ట్రంలోని ముఖ్య నాయకుల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు. హ్యాకర్లను ఉపయోగిస్తూ అంతర్జాతీయ నేరానికి పాల్పడుతోందని చెప్పారు. దీనికి కేసీఆర్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఐజీ ప్రభాకరరావు ఖాసిం రిజ్వీ మాదిరి వ్యవహరిస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకరరావుకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఐజీ ప్రభాకరరావుపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Also Read : పాలకుల చేతిలో అస్త్రం.. 124 ఏ సెక్షన్

భయపెడుతున్న గతం

ఓటుకు నోటు వ్యవహారం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడినట్లుగా ఆడియో టేపులు బయటికి వచ్చాయి. స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇవ్వజూపుతూ రేవంత్ రెడ్డి వీడియోలో కనిపించారు. దీంతో నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. జైలు జీవితమూ అనుభవించారు. అయితే ఈ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన ఫోన్లతోపాటు మంత్రులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ కోర్టులకు వెళ్లారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పని అయిపోయిందంటూ అప్పట్లో కేసీఆర్ హెచ్చరించారు. కానీ కేసు నీరు గారిపోయింది. చంద్రబాబు, కేసీఆర్ మధ్య తాను మధ్యవర్తిగా వ్యవహరించానని, సయోధ్య కుదిర్చానని ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు జెరూసలేం మత్తయ్య గతంలో చెప్పారు. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన సాక్షుల విచారణ మాత్రం ఏసీబీ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది.

ఓ కన్నేసిన టీఆర్ఎస్

తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డిపై ముందు నుంచీ ఓ కన్నేసి ఉంచింది. గతంలో టీఆర్‌‌ఎస్, కేసీఆర్‌‌పై వాయిస్ పెంచడంతో వల వేసి మరీ ఇరికించింది. కొడంగల్‌ లో ఓడించింది. అయితే రేవంత్ మాత్రం గోడకు కొట్టిన బంతిలా రైజ్ అయ్యారు. ముందు చంద్రబాబు అండదండలతో జైలు నుంచి బయటికి వచ్చారు. తర్వాత మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. అయితే.. ఇంకా ఓటుకు నోటు కేసు ముగిసిపోలేదు. అందుకే రేవంత్ రెడ్డిలో ఫోన్ ట్యాపింగ్‌ల భయం పోలేదు.

Also Read : యూపీ జనాభా నియంత్రణ చ‌ట్టం.. శాసనసభ ఎన్నికలకు వ‌ర్తింప చేస్తే 152 మంది ఎమ్మెల్యేలు ఔట్‌!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp