తిరుప‌తి గంగ‌జాత‌ర - రాజీవ్‌గాంధీ హ‌త్య‌

By G.R Maharshi May. 22, 2020, 12:56 pm IST
తిరుప‌తి గంగ‌జాత‌ర - రాజీవ్‌గాంధీ హ‌త్య‌

1991 మే 21, తిరుప‌తిలో గంగ‌జాత‌ర. వేడుక‌గా , క‌ళ‌గా ర‌క‌ర‌కాల వేషాల‌తో జాత‌ర ప్రారంభ‌మైంది. ఉద‌యం నుంచే జ‌నం మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేను ఆంధ్ర‌జ్యోతిలో చేరి అప్ప‌టికి మూడేళ్లు. జాత‌ర రోజు సెల‌వు పెట్ట‌డం నా అల‌వాటు. మిత్రుల‌తో క‌లిసి రాత్రంతా స‌ర‌దాగా జాత‌ర‌లో తిరిగేవాన్ని.

తుడా ఆఫీస్ నుంచి ప్రతాప్ టాకీస్ వ‌ర‌కూ జాత‌ర సంబ‌రాలు అంటే ఒక పావు కిలోమీట‌రు ఇరుకైన రోడ్డులో జ‌రుగుతుంది. బొమ్మ‌లు, టెంకాయ‌లు, నానా చిరుతిళ్లు, మ‌ట్టి కుండ‌లు అమ్ముకునే వాళ్ల‌తో నిండిపోతుంది.

రాత్రి 9 గంట‌ల‌కు కొంద‌రు మిత్రుల‌తో జాత‌ర‌కు వెళ్లాను. రంగుల రాట్నాల‌లో పిల్ల‌లు తిరుగుతున్నారు. వేషాల‌తో కొంద‌రు భ‌య‌పెడుతున్నారు. చాలా మంది మ‌గ‌వాళ్లు ఆడ‌వేషాల‌తో సిగ్గు ఒల‌క‌బోస్తున్నారు (గంగ‌మ్మ మొక్కులో భాగంగా ఆడ‌వేషాలు వేస్తారు).
రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో హ‌ఠాత్తుగా జాత‌ర జనంలో భ‌యం. దుకాణాల‌న్నీ స‌ర్దుకుంటున్నారు. అక్క‌డ్నుంచి వెళ్లిపోతున్నారు. ఇంత‌లో మా సీనియ‌ర్ ఒకాయ‌న వ‌చ్చి రాజీవ్‌గాంధీని కంచి ద‌గ్గ‌ర హ‌త్య చేశారు తెలుసా, బాంబు పెట్టారు అని చెప్పాడు. అప్ప‌టికే జాత‌ర‌లో జ‌నం ప‌రుగులు తీస్తున్నారు.

ఎవ‌రికి వాళ్లు హ‌డీవుడిగా ఇళ్ల‌కు బ‌య‌ల్దేరాం. మా ఇల్లు అక్క‌డికి కిలో మీట‌ర్ దూరం. బండ్ల వీధిలోకి వెళ్లేస‌రికి అక్క‌డ కొంత మంది కుర్రాళ్లు అరుస్తూ క‌ర్ర‌ల‌తో జ‌నాల్ని త‌రుముతున్నారు. ఎలాగో త‌ప్పించుకుని క‌ర్ణాల‌వీధి చేరుకుంటే అక్క‌డ ఒక గుంపు వాహ‌నాల్ని ఆపేస్తూ ఉంది. ఒక టైరు రోడ్డు మీద త‌గ‌ల‌బ‌డుతోంది. అక్క‌డ్నుంచి సందుగొందుల్లో ప‌ళ‌ణి టాకీస్ వ‌ర‌కూ వెళ్లి ఇల్లు చేరాను.

త‌ర్వాత నాలుగు రోజులు ఊరంతా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం. ఆఫీస్‌కి భ‌యంభ‌యంగా వెళ్లేవాన్ని. మ‌ధ్య‌లో ఆపేవాళ్లు. ప్రెస్ అంటే వ‌దిలేసేవాళ్లు. తిరుప‌తిలో త‌మిళులు ఎక్కువ‌. వాళ్ల‌పై దాడులు జ‌రుగుతాయ‌ని భ‌య‌పడ్డారు. కానీ చిన్న సంఘ‌ట‌న కూడా జ‌ర‌గ‌లేదు.
తిరుప‌తి గొప్ప‌త‌నం ఏమంటే ప్ర‌జ‌లే కాదు, నాయ‌కులు కూడా హింస‌ని ఇష్ట‌ప‌డ‌రు. మ‌బ్బురామిరెడ్డి నుంచి క‌రుణాక‌ర్‌రెడ్డి వ‌ర‌కు ఎవ‌రూ కూడా హింస‌ని ప్రోత్స‌హించ‌లేదు. క‌రుణాక‌ర్‌రెడ్డి మీద క‌డ‌ప ముద్ర వేసి, దౌర్జ‌న్యాన్ని అంట‌గ‌ట్టాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నించినా అవి విఫ‌ల‌మయ్యాయి.

రాడిక‌ల్ విద్యార్థి నాయ‌కుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా సాహిత్యాన్ని ప్రేమించాడే కానీ, హింస‌ని ఒక్క సంద‌ర్భంలో కూడా ప్రోత్స‌హించిన వ్య‌క్తి కాదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp