పంచ్ పడుద్ది : తిరుపతి ఎన్నికల రంగంలోకి జగన్

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక మరింత రసకందాయంలో పడింది. స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగనున్నారన్న వార్త పొలిటికల్ హీట్ ను పెంచింది. జనవరి నుంచీ ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటున్నప్పటికీ జగన్ నేరుగా రంగంలోకి దిగింది లేదు. ప్రచారం చేసింది లేదు. అయినప్పటికీ ప్రజలు వైసీపీకే పట్టం కట్టారు. మనం చేసే పనులే ప్రజలకు చేరాలి.. అవే మనల్ని గెలిపిస్తాయని నమ్మిన జగన్ తిరుపతి బై పోల్ విషయంలో కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అయితే, వైసీపీ మంత్రులు, నేతల వినతి మేరకు ఆయన తిరుపతి ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించారు. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపు కోసం ఆయన ఈ నెల 14వ తేదీన ప్రచారం చేయబోతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ సుడిగాలి పర్యటన చేసేలా పార్టీ ప్లానింగ్ చేస్తోంది.
వారి ఆశలు గండి పడినట్లే..
ఉప ఎన్నికలో భారీ మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఆ దిశగా ప్రచారంలో ముందంజలో దూసుకెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి కి లభిస్తున్న ఆదరణతో అనుకున్న మెజార్టీ ఖాయమన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. 4 నుంచి 5 లక్షల మెజార్టీ సాధించి చరిత్రను తిరగరాయాలన్న కసితో వైసీపీ నాయకత్వం పని చేస్తోంది. ఈ క్రమంలో తిరుపతి లో గెలవకపోయినా కనీసం హవా చాటి పరువు నిలబెట్టుకోవాలని టీడీపీ, సత్తా చాటాలని బీజేపీ జనసేన చూస్తున్న ఈ తరుణం లో జగన్ తన పర్యటన తో వారి ఆశలకు గండి పడనున్నాయి. జగన్ పర్యటన అనంతరం బై పోల్ పరిస్థితి మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీకి భారీగా ఓట్లు పోలైతే టీడీపీ, బీజేపీ లు గతం కంటే దిగజారే చాన్స్ లేకపోలేదు. ఈ అనుమానాలే ఇప్పుడు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
వరుసగా రెండు సార్లు
2014, 2019 ఎన్నికల్లో కూడా తిరుపతి లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. 2014లో వెలగపల్లి వరప్రసాదరావు 47.84 శాతం అంటే 5 లక్షల 80 వేల 376 ఓట్లు సాధించి విజయం సాధించారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున బల్లి దుర్గా ప్రసాద్ రావు పోటీ చేసి విజయం సాధించారు. దుర్గా ప్రసాద్ రావు 55.03 శాతంతో ఏడు లక్షల 22 వేల 877 ఓట్లు సాధించారు. 2021 లో జరుగుతున్న ఉప ఎన్నికలో కూడా వైసీపీ విజయం ఖాయమే అన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో 2 లక్షల 28 వేల 376 ఓట్ల మెజారిటీ వైసీపీ అభ్యర్థి దుర్గా ప్రసాద్ పొందారు. దీంతో ఇప్పుడు దానికి డబుల్ సాధించాలనే పట్టుదలతో ఆ పార్టీ వ్యూహ రచన సాధించింది. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిని బరిలోకి దింపింది. గెలుపు కోసం కృషి చేసేందుకు బలమైన టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.
పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు కీలక మంత్రులను నియమించడం ద్వారా గెలుపును ముందే డిక్లేర్ చేసేలా చర్యలు తీసుకున్నారు. మంత్రులతో పాటు పాటు ప్రతీ నియోజకవర్గానికి మరో ముఖ్యనేతకు బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా పర్యవేక్షించేందుకు మరో ఇద్దరు సీనియర్లను నియమించారు. ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, గౌతంరెడ్డి ఆయా నియోజకవర్గాలను పలు మార్లు చుట్టేశారు. కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ ఆదేశాల ప్రకారం దిశా నిర్దేశాలు చేస్తున్నారు. ఇవన్నీ వైసీపీ అనుకున్న మెజార్టీ సాధించేందుకు దోహదంగా మారుతున్నాయి.
సర్వత్రా ఆసక్తి
ఇప్పుడు జగన్ కూడా ఉప ఎన్నికల ప్రచారానికి ఈ నెల 14న తిరుపతి వెళ్లనున్నారు. ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. రెండు రోజులు ముందుగా 15న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ప్రచారం సమాప్తం కావడానికి ఒకరోజు ముందు సీఎం జగన్ ప్రచార పర్యటన ఖరారు కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ సభల్లో జగన్ పాల్గొన్నది లేదు. జనవరి నుంచి వరుసగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వెనుక ఉండి శ్రేణులను నడిపించారే తప్పా ప్రచారంలో పాల్గొనలేదు. చాన్నాళ్ల తర్వాత జగన్ పాల్గొనే సభ కావడంతో అంతటా ఉత్కంఠ ఏర్పడింది. ఎవరిపై ఎటువంటి పంచ్ లు పడతాయోనన్న ఆసక్తి సర్వత్రా ఉంది.


Click Here and join us to get our latest updates through WhatsApp