తిరుపతి సభ రద్దు.. మనస్సులు గెలుచుకున్న సీఎం జగన్‌

By Karthik P Apr. 10, 2021, 06:30 pm IST
తిరుపతి సభ రద్దు.. మనస్సులు గెలుచుకున్న సీఎం జగన్‌

రాజకీయ పార్టీలు అంటే.. ఓట్లు, సీట్లు గెలుచుకోవడమే వాటి అంతిమ లక్ష్యం. ఎన్నికల్లో గెలుపు కోసం కొట్లాటలు, తీవ్ర హింస చోటు చేసుకోవడం, బలగాల కాల్పుల్లో ప్రజలు చనిపోవడం ఇప్పటికీ దేశంలో పలు ప్రాంతాలలో జరుగుతూనే ఉన్నాయి. రాజకీయం ఓట్లు, సీట్లు కోసమే కాదు.. ప్రజల సంక్షేమం కోసమని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీడీపీ, బీజేపీల తరఫున అగ్రనేతలు, అధినేతలు రోజుల తరబడి తిరుపతి లోక్‌సభ పరిధిలో తిష్ట వేశారు. వైసీపీ అభ్యర్థి తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ప్రచారం నిర్వహించాలని తలపెట్టారు. ఈ నెల 14వ తేదీన తిరుపతిలో సభ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.

అయితే సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సభను రద్దు చేసుకున్నారు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ లేఖ రాశారు. సభ రద్దుకు జగన్‌ చెప్పిన కారణాలును చూస్తే.. ఎన్నికలు, ఓట్లు కన్నా.. ప్రజా ఆరోగ్యం, సంక్షేమానికే వైఎస్‌ జగన్‌ ప్రధమ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతంగా ఉందని, ఏపీలోనూ కొత్త కేసుల నమోదు శాతం పెరుగుతోందని జగన్‌ ఆ లేఖలో వివరించారు. ఎన్నికల సభ నిర్వహించడం వల్ల కోవిడ్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని, సభకు వచ్చిన వారి ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందనే ఆందోళనతో తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సీఎం జగన్‌ వివరించారు.

ఓట్లే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో రోజూ రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తరఫున మంత్రులు డోర్‌ టూ డోర్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ముగిసే ముందు రోజు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తే.. వైసీపీ అభ్యర్థికి లాభదాయకమనే ఆలోచన వైసీపీ నేతలు చేసినా.. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం తాజా పరిస్థితులలో సభనే రద్దు చేసుకోవడం ప్రజా ఆరోగ్యం పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఈ నిర్ణయం ద్వారా వైఎస్‌ జగన్‌.. ప్రజల మనస్సులను మరింతగా చూరగొన్నారు.

Also Read : ఎన్నికల ప్రచారం.. నూతన ఒరవడికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp