టీడీపీకి తిరుప‌తి క‌లిసొచ్చే సీటు కాదా..?

By Kalyan.S Apr. 07, 2021, 09:10 am IST
టీడీపీకి తిరుప‌తి క‌లిసొచ్చే సీటు కాదా..?

తెలుగుదేశం పార్టీకి తిరుప‌తి లోక్ స‌భ ఎప్పుడూ క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒకే ఒక్క సారి మాత్ర‌మే ఆ పార్టీ విజ‌యం సాధించ‌గ‌లిగింది. మొత్తంగా ఐదు సార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను పాలించిన ఆ పార్టీ తిరుప‌తి లోక్ స‌భ ను సాధించ‌డంలో మాత్రం ఎప్పుడూ విఫ‌లం అవుతూనే ఉండేది. తిరుపతి పార్లమెంట్ స్థానంలో తొలి నుంచీ టీడీపీ మిన‌హా ఇత‌ర పార్టీలే అధికారంలోకి వ‌స్తున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒక్కసారి 1984లో ఆ పార్టీ అక్క‌డ విజయం సాధించగలిగింది.

రాష్ట్రంలో రాజ‌కీయంగా నానాటికీ దిగ‌జారిపోతున్న తెలుగుదేశం పార్టీ తాజాగా తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. క‌నీస పోటీ ఇచ్చి ప‌రువు ద‌క్కించుకోవాల‌నే తాప‌త్ర‌యంతో ముందుకెళ్తోంది. వార్ రూమ్ లు, క్ల‌స్ట‌ర్ లు, డివిజ‌న్ లు ఇలా ర‌క‌ర‌కాల కోణాల్లో వ్యూహ ర‌చ‌న‌లు చేస్తూ ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తో పాటు నారా చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ స‌హా పార్టీలో మిగిలిన ప్ర‌ముఖులంద‌రూ అక్క‌డే తిష్ట వేశారు. అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మితో క‌లిసి ఎండ‌లో చెమ‌టోడ్చి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు.

కానీ తిరుప‌తి లోక్ స‌భ‌లో టీడీపీకి ఎప్పుడూ ఓట‌మి త‌ప్ప‌డం లేదు. 1983, 1984, 1994, 1999, 2014 సంవ‌త్స‌రాల్లో పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కూడా కేవ‌లం 1984లో ఎన్టీఆర్ హ‌వాలో త‌ప్పా ఎప్పుడూ అక్క‌డ గెలిచింది లేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున చింతామోహన్ బ‌రిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ గెలిచింది. కానీ, తొలిసారిగా 1999లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి విజయం దక్కింది.

తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబు చేతుల్లోకి వ‌చ్చాక ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా కానీ ఇక్క‌డ గెలిచింది లేదు. పదే పదే ప్రయత్నం చేస్తూ పలువురు అభ్యర్థులను మారుస్తూ రంగంలో దిగినా ఇక్కడ పట్టు సాధించలేకపోయింది. 2004, 2009ల‌లో జ‌రిగిన‌ ఎన్నికల్లో చింతామోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఈ కాలంలో ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. తిరుపతి నుంచి ఆయన ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నిక కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి పోటీ చేశారు. ఆమె 4,94,501 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఉప ఎన్నిక‌లో మరోసారి ఆమె టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం పోరాడుతున్నారు. అయితే, ప్ర‌స్తుతం పార్టీకి రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి గెలుపు ఎట్టి ప‌రిస్థితుల్లో సాధ్యం కాద‌ని అత్య‌ధిక మంది ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ద్వితీయ స్థాన‌మైనా నిల‌బెట్టుకుంటుందో, లేదో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp