Nara Lokesh - లేఖతో బయట పడిన డొల్లతనం

By Aditya Oct. 15, 2021, 01:00 pm IST
Nara  Lokesh - లేఖతో బయట పడిన డొల్లతనం

సీఎం జగన్ కు బహిరంగ లేఖ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న పబ్లిసిటీ స్టంటు డొల్లతనాన్ని బయట పెడుతోంది. తాను చెప్పదలచుకున్న అంశంపై తనకే స్పష్టత లేనప్పుడు జనం తరఫున తాను పోరాడుతున్నట్టు బిల్డప్ ఇస్తే ఎవరు నమ్ముతారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టు తెలుగు మాట్లాడ్డం సరిగా రాని లోకేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారంటే అది ఎంత గొప్పగా ఉంటుందో ఊహించవచ్చు. సాధారణంగా ఇలాంటి లేఖలు ఘోస్ట్ రైటర్లు రాసేస్తారు అన్న సంగతి తెలిసిందే. అయితే అందులో కంటెంట్ ఏమి ఉండాలో? ఎలా ఉండాలో లేఖ రాయాలనుకున్నవారు డిసైడ్ చేస్తారు. కానీ లోకేశ్ అందులో కూడా వేలు పెట్టె పరిస్థితి లేదు కనుక ఆ బాధ్యత వేరొకరికి అప్పగించి ఉంటారు. ఎవరికీ అప్పగించారో కానీ అదిగో అక్కడే తేడా కొట్టింది.

అవుట్ సోర్సింగ్ వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలట..

తొలగించిన ఆప్కాస్ (ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్ సర్వీసెస్‌) ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లోకేశ్ తన లేఖలో డిమాండ్ చేశారు. సొంత వర్గాన్ని, పార్టీ కార్యకర్తలను కొలువుల్లో కూర్చోబెట్టేందుకు పోస్టులు అమ్ముకొని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించటం సరికాదని రాసేశారు. వారికి జీతాలిచ్చే ఏజెన్సీలను రద్దు చేసి ఆప్కాస్ పరిధిలోకి తీసుకొస్తూ మరో మోసానికి తెరలేపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఆయనకే గుర్తు చేస్తూ ఇలా లేఖలు రాయాల్సి రావటం విచారకరం అంటూ గంభీరంగా ప్రారంభించిన ఈ లేఖలో ఏవేవో రాసేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంటే పర్మినెంట్ కొలువులు కావని, ఉద్యోగ భద్రత అనేది వాటికి వర్తించదు అనే విషయం కూడా తెలియకుండా లేఖ రాయడం విశేషం.

Also Read : Kapu Corporation - ఎంతో చేసిన టీడీపీని కాపులు ఎందుకు తిరస్కరించారో?

ఏది అరాచకం?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఇప్పటివరకు కాకినాడ జీజీహెచ్‌లో 66 మందిని, 1,700 యూపీహెచ్‌సీ ఉద్యోగులు, 180 మంది ఆప్కాస్ ఉద్యోగులను తొలగించారు. పెండింగ్ జీతాలు అడుగుతున్నార‌ని 600 మందిని తొలగించటం అరాచకానికి నిదర్శనం అని లేఖలో లోకేశ్‌ పేర్కొన్నారు. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత ఉద్యోగాలు కోల్పోవడం సహజం. అయినా తమను పర్మినెంట్ చేయాలంటూ పైన పేర్కొన్న వారంతా ఆందోళనలు చేస్తున్నారు. అది సాధ్యం కాదని ప్రభుత్వం వారికి విస్పష్టంగా చెప్పినా వారు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలియకుండా ప్రభుత్వం వారి గొంతు కోసేసిందని ఈయన గొంతు చించుకోవడమే విడ్డూరం. 20 నెలల బకాయిలు ఎగ్గొట్టి ఉద్యోగాలు తొలగించారు. వీరికి చెల్లించాల్సిన జీతాలను ఎటు మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండు చేసిన లోకేశ్ ఉద్యోగం నుంచి తొలగించాక జీతాలు ఏ విధంగా బకాయి పడినట్టు అవుతుందో వివరించలేదు. పైగా వాటిని దారి మళ్ళించారు అంటూ ఆరోపణ చేశారు.

ఉద్యోగం ఉన్నా తెల్లకార్డు ఉండాలా?

ఏజెన్సీలు లేకుండా జీతాలివ్వలేమంటూ ఉద్యోగులుగా సీఎఫ్ఎంఎస్‌లో న‌మోదు చేయ‌డంతో తెల్ల రేష‌న్‌కార్డులు రద్దవ్వటంతోపాటు అన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులయ్యారని రాశారు. అల్పాదాయ వర్గాలకు ఉద్దేశించిన తెల్లరేషన్ కార్డు కాంట్రాక్టు ఉద్యోగులకు రద్దయిందని బాధ పడిపోవడం ఏమిటో అర్థం కాదు.

ఎప్పుడు మాట ఇచ్చారు?

ఉద్యోగ భద్రత కల్పిస్తానంటూ ఇచ్చిన మాట తప్పి ఉద్యోగాలే లేకుండా చేయటం తీవ్ర అన్యాయమని పేర్కొన్న లోకేశ్ వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని జగన్మోహన్రెడ్డి ఎప్పుడు మాట ఇచ్చారో చెప్పలేదు. అసలు జగన్ ఏ మాటా ఇవ్వకపోయినా ఇచ్చినట్టు జనాన్ని నమ్మించాలని ఆయన తాపత్రయం. ఇలా తలా తోకా లేని లేఖ రాసి డొల్లతనాన్ని లోకేశ్ బయట పెట్టుకున్నారు.

Also Read : Drugs Trafficking - చంద్రబాబు తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, మళ్లీ యూటర్న్ తీసుకుంటారా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp