గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టలేం...

By Raju VS Aug. 01, 2020, 08:30 am IST
గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టలేం...

మూడు రాజధానుల విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టలేం అని బీజేపీ పేర్కొంది. అది రాజ్యాంగ బద్దమని పేర్కొంది. రాజకీయ కోణంలో విమర్శలు తగవని సూచించింది. టీడీపీ, సీపీఐ నేతల వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో గవర్నర్ కి, కేంద్రానికి అధికారాలుండవని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అంతా కేంద్రం, గవర్నర్ అనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. తాము కూడా కర్నూలులో హైకోర్ట్ కోసం ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

రాజధాని అంశంలో గవర్నర్ తీసుకున్న తుది నిర్ణయం ఏపీ రాజకీయాల్లో వేడి రాజేసింది. విపక్షం తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా ఈ నిర్ణయానికి తగు సమయం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేగాకుండా ఢిల్లీ పర్యటనలో ఉన్న సోము వీర్రాజు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుని బీజేపీ నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు. గవర్నర్ మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. నిపుణులతో చర్చించి, రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. గవర్న ర్ ని నిందించటం శోచనీయం, చంద్రబాబు అవకాశవాదానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు.

అమరావతి కి మద్ధతుగా తాము తీర్మానం చేశామని గుర్తు చేస్తూ, మూడు రాజధానుల అంశంలో నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అమరావతి అంశంతో తాము చేసిన తీర్మానం రైతుల, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేసిన రాజకీయ తీర్మానం మాత్రమేనన్నారు. దానిని కేంద్రం ప్రభుత్వ విధానంగా భావించడం అవివేకం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని సోము వీర్రాజు విమర్శించారు. ఐదేళ్ల పాటు బాబు నిర్వాహకం మూలంగా రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం సీఆర్డీయే రద్దు అయిన నేపథ్యంలో అమరావతి రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp