భారత్‌లో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించడానికి రంగం సిద్ధం చేసిన కేంద్రం

By Srinivas Racharla May. 27, 2020, 06:06 pm IST
భారత్‌లో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించడానికి రంగం సిద్ధం చేసిన కేంద్రం

తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 31 తర్వాత మరో రెండు వారాల వరకు లాక్ డౌన్‌ను పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజులలో మే 31 న లాక్ డౌన్‌ 4 .0 ముగుస్తుంది.లాక్ డౌన్ 4.0 లో కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం ఈసారి లాక్ డౌన్ 5.0 లో మరింత ఎక్కువగా సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం ఐదో విడత లాక్‌డౌన్‌లో దేశంలోని నమోదవుతున్న కోవిడ్ -19 కేసులలో దాదాపు 70 శాతం ఉన్న 11 నగరాలపై ఎక్కువ దృష్టి పెడతామని పెట్టనున్నట్లు తెలిపారు. ఆయన లాక్‌డౌన్‌ తరువాతి దశను "ఆత్మలో లాక్‌డౌన్‌ పొడిగింపు" గా అభివర్ణించారు.భారత్‌లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆరు ప్రధాన మెట్రో నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతాలతో పాటు పూణె, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌ పట్టణాలలో నమోదవుతున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నాలుగవ దశలో కంటెంట్మెంట్ జోన్లకు మాత్రమే ఎక్కువగా ఆంక్షలు విధించింది. నిబంధనలకు లోబడి మార్కెట్లు, కార్యాలయాలు, పరిశ్రమలు తెచ్చుకునేందుకు మరియు వ్యాపార కార్యకలాపాలకు కేంద్రం అనుమతించింది. అలాగే గత వారం పరిమిత సామర్థ్యంతో దేశీయ విమాన సర్వీసులు నడపడానికి కూడా అనుమతించిన సంగతి తెలిసిందే.

ఐదో విడత లాక్‌డౌన్‌లో సామాజిక దూరం పాటిస్తూ వ్యాయామశాలలు,ప్రార్థనా మందిరాలు కూడా తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.అలాగే రాష్ట్రస్థాయిలో ప్రజా రవాణాకు అనుమతించిన కేంద్రం అంతర్రాష్ట్ర రవాణా అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకోవచ్చు.ఇక లాక్‌డౌన్‌ తదుపరి దశలోనూ మాల్స్, సినిమా థియేటర్లు,విద్యాసంస్థలు మరియు జనం భారీగా గుమ్మిగూడే ప్రదేశాలపై ఆంక్షలను కొనసాగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే భారత్‌లో గత 14 రోజులలో కరోనా కేసుల సంఖ్య రెండింతలై 151767 కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా గత 16 రోజులలో రెట్టింపు అయ్యి 4337 కు చేరుకుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp