సుర‌భి తెలుగు సంప‌ద‌

By G.R Maharshi Jun. 11, 2021, 06:30 pm IST
సుర‌భి తెలుగు సంప‌ద‌

సుర‌భి క‌ష్టాల్లో ఉంది. ఎపుడూ క‌ష్టాల్లోనే ఉంది. కానీ గ‌తంలో ఆర్థిక క‌ష్టాలు మాత్ర‌మే. ఈ సారి ఆరోగ్య క‌ష్టాలు. క‌రోనా చాలా మంది క‌ళాకారుల్ని తీసుకెళ్లింది. జీవిత‌మంతా నాట‌కాన్ని బ‌తికించిన వాళ్లు బ‌త‌క‌లేక పోయారు.

ప‌ద్య నాట‌కం మ‌న తెలుగు వాళ్ల ఆస్తి. ఇంకెవ‌రికీ లేదు. శ‌తాబ్ద కాలం నుంచి సుర‌భి ఆ వెలుగుని కాపాడింది, చేతులు కాలినా స‌రే. ఎందుకంటే వాళ్లు నాట‌కం కోసమే పుట్టారు, చ‌నిపోయారు. నెల‌లు నిండిన మాతృమూర్తి, దేవ‌కి పాత్ర వేస్తూ రంగ‌స్థ‌లంపై బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌డం ప్ర‌పంచ నాట‌క చ‌రిత్ర‌లో ఎక్క‌డైనా జ‌రిగిందా? ఆ బిడ్డ మ‌రుస‌టి రోజు బాల‌కృష్ణుడిగా ఊయల ఊగ‌డం కూడా సుర‌భిలోనే జ‌రుగుతుంది. ముల్లోకాల‌ను స్టేజి మీద చూపించే సుర‌భికి నాట‌క‌మే లోకం.

నా చిన్న‌త‌నంలో సుర‌భి నాట‌కాల గురించి పెద్ద‌వాళ్లు చెప్పుకునే వాళ్లు. స్టేజి వెంట వెంట‌నే మారిపోతుంద‌ని, సినిమాలోలాగా ట్రిక్స్ వుంటాయ‌ని, మాయా బ‌జార్‌లో ల‌డ్డూలు ఘ‌టోత్క‌చుడి నోట్లోకి వెళ్ల‌డం చూసి తీరాల‌ని అనేవాళ్లు.

రాయదుర్గం చిన్న ఊరే అయినా నాట‌కాల‌కి కొద‌వ లేదు. లైబ్ర‌రీలో రెగ్యుల‌ర్‌గా వేసేవాళ్లు. అయితే దానికి ముందు పుర ప్ర‌ముఖులు మైకుని వ‌ద‌ల‌కుండా స్పీచ్‌లు ఇచ్చేవాళ్లు. అవ‌న్నీ చ‌చ్చిన‌ట్టు వినేవాళ్లం, నాట‌కం కోసం. చివ‌రికి పెద్ద మ‌నుషులు ముగించ‌గానే, ఇద్ద‌రు వ‌చ్చి కుర్చీలు, టేబుళ్లు తీసుకెళ్లే వాళ్లు. ఒకాయ‌న వ‌చ్చి మైక్ టెస్టింగ్ ఒన్ టూ త్రీ చెప్పి , కాసేప‌ట్లో మ‌హ‌త్త‌ర సాంఘిక నాట‌కం ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మిమ్మ‌ల్ని అల‌రించ‌డానికి స‌త్య‌నారాయ‌ణ‌, నారాయ‌ణ స్వామి రికార్డ్ డ్యాన్స్ వుంటుంద‌ని చెప్పేవాడు.

(స‌త్య‌నారాయ‌ణ (స‌త్తి) NTR అభిమాని TDP ZPTC గా కూడా ప‌నిచేసి ఈ మ‌ధ్య చ‌నిపోయాడు. నారాయ‌ణ‌స్వామి ప్ర‌స్తుతం రాయ‌దుర్గంలో హోట‌ల్ ఓన‌ర్‌)
స్వామి ఆడ‌వేషంలో అద‌ర‌గొట్టేవాడు. జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇప్పుడు జెంట్స్ లేడీస్ గెట‌ప్‌లు వేస్తున్నారు కానీ, మా వాడు 1974కే జ‌బ‌ర్ద‌స్త్. వీళ్లిద్ద‌రూ స్టెప్పులేస్తే చెక్క‌ల‌తో క‌ట్టిన స్టేజి గ‌జ‌గ‌జ వ‌ణికేది. స్వామి కొంత కాలం చ‌దువు ఆపి మ‌ద్రాస్‌లో డ్యాన్స్ నేర్చుకున్నాడు. అది రాయ‌దుర్గం ప్ర‌జ‌ల‌కి ఈ ర‌కంగా ఉప‌యోగ‌ప‌డేది. జీవితాశ‌యం సినిమాలో స్వామి చైల్డ్ హీరోగా చేశాడు. స్కూల్లో పెద్ద సెల‌బ్రిటీ.

త‌ర్వాత డ్రామా స్టార్ట్ అయ్యేది. సీన్ మారిన‌ప్పుడ‌ల్లా అర‌గంట ప‌ర‌దా వేసి రంగాలంక‌ర‌ణ చేసేవాళ్లు. అంటే ఏం లేదు. నాలుగు కుర్చీలు అటుఇటు మార్చ‌డం. దానికే టైం తినేసేవాళ్లు.

ఆ రోజుల్లో దొంతి సుబ్బ‌య్య‌శెట్టి అనే ఆయ‌న గొప్ప నాట‌కాభిమాని. రాయ‌దుర్గంలో రాష్ట్ర స్థాయి నాట‌క పోటీలు నిర్వ‌హించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఫ‌స్ట్ టైం ధూళిపాళ్ల , కృష్ణ‌కుమారి లాంటి సినీ తార‌ల‌ని టౌన్‌కి ర‌ప్పించిన వ్య‌క్తి. నాట‌కాల మీద ప్రేమ‌తో ఆస్తుల్ని అమ్మేసుకున్న సుబ్బ‌య్య ఇప్పుడెవ‌రికీ గుర్తు లేక‌పోవ‌చ్చు. క‌ళ‌ల్ని ప్రేమించిన వాళ్ల‌కి క‌ల‌లు క‌నేవాళ్ల‌కి విగ్ర‌హాలు ఉండ‌వు.

1974లో సుర‌భి రానే వ‌చ్చింది. మా ఫ్రెండ్ శ్రీ‌ధ‌ర్ ఇంటి ఎదురుగా ఒక తోట వుంది. అక్క‌డ గ‌తంలో నూర్ టారింగ్ టాకీస్ ఆడేది. జ‌రుగుబాటు లేక టెంట్ పీకేశారు. అక్క‌డ ఓ రేకుల షెడ్డులో సుర‌భి నాట‌కాలు మాయ‌బ‌జార్‌, బ్ర‌హ్మంగారి చ‌రిత్ర‌, బాల‌నాగ‌మ్మ‌, కృష్ణ‌లీల‌లు అన్నీ వ‌రుస‌గా చూశాను.

Also Read : తెరాస లోక్ సభ పక్ష నాయకుడి ఇంటిపై ఈడి దాడులు

అద్భుత‌మైన లైటింగ్‌, మ్యూజిక్‌, వైర్ ట్రిక్స్‌, నోరెళ్ల‌బెట్టి చూశాను. దాదాపు నెల‌రోజులు హౌస్‌ఫుల్‌. 1978లో ఇంట‌ర్‌లో ఉండ‌గా అనంత‌పురం ల‌లితాక‌ళాప‌రిష‌త్‌లో నెల‌రోజులు వేశారు. అప్పుడూ చూశాను. కానీ చిన్న‌ప్ప‌టి థ్రిల్ ఏదో మిస్ అయ్యింది. ఆ ట్రిక్స్ ఎలా చేస్తారో నాకు తెలిసిపోయింది. తెలివిడి మ‌న ఆనందాన్ని తీసుకెళ్లిపోతుంది. అజ్ఞానాన్ని మించిన ర‌క్ష‌ణ లేదు.

త‌ర్వాత తిరుప‌తిలో కూడా వేశారు కానీ, డెస్క్‌లో నైట్ డ్యూటీ వ‌ల్ల వెళ్ల‌లేక పోయాను. డెస్క్‌లో ప‌నిచేస్తే నాట‌కాన్ని మిస్ అవుతాం. కాక‌పోతే రోజూ రాజ‌కీయ నాట‌కాల్ని వార్త‌ల్లో చూస్తూ వుంటాం.

1997లో క‌డ‌ప జిల్లాలో సుర‌భి గ్రామాన్ని చూడ‌డం మంచి జ్ఞాప‌కం. అక్క‌డ సుర‌భి ఉత్స‌వాలు జ‌రిగిన‌ప్పుడు నేను ఆంధ్ర‌జ్యోతి క‌డ‌ప ఇన్‌చార్జ్‌. 2005లో న‌వ్య వీక్లీ కోసం నాగేశ్వ‌ర‌రావు (బాబ్జీ) ఇంట‌ర్వ్యూ తీసుకుని స్పెష‌ల్ ఫీచ‌ర్ రాశాను. అప్పుడు అక్క‌డున్న క‌ళాకారుల ప‌రిచ‌యం నా అదృష్టం.

ఒక ద‌శ‌లో సుర‌భి ఇక బ‌త‌క‌దేమో అనుకున్న‌ప్పుడు ఊపిరి పోసిన వ్య‌క్తి కేవీ.ర‌మ‌ణాచారి. ఆయ‌న ఎక్క‌డుంటే అక్క‌డ స‌ర‌స్వ‌తికి గౌర‌వం. స్నేహం కూడా స‌ర‌స్వ‌తి పుత్రుల‌తోనే , ల‌క్ష్మిపుత్రుల‌తో కాదు. క‌డ‌ప క‌లెక్ట‌ర్‌గా, టీటీడీ ఈవో, క‌ల్చ‌ర‌ల్ శాఖ అధికారిగా ఎంద‌రికి సాయం చేశారో ఆయ‌న‌కి గుర్తు లేక‌పోవ‌చ్చు కానీ, సాయం పొందిన వాళ్ల‌కి గుర్తే.

క‌ష్టం సుర‌భికి కొత్త‌కాదు. ఎన్నో చూసింది. మ‌ళ్లీ నిల‌బ‌డుతుంది.

ఎవ‌డికి వాడు వంద నాట‌కాలు వేస్తున్న రోజుల్లో నాట‌కాన్ని బ‌తికించ‌డం అవ‌స‌రమంటారా? అవ‌స‌ర‌మే. సుర‌భి వాళ్లు బ‌త‌క‌డానికి నాట‌కాలేశారు. బాగా బ‌త‌క‌డానికి వేయ‌లేక‌పోయారు. రంగ‌స్థలంపై అద్భుతంగా న‌టిస్తూ, జీవితంలో న‌టించ‌లేని వాళ్ల‌ని మ‌నం ప్రేమించాలి. ఎందుకంటే వాళ్లు చాలా అరుదు. వెతికినా దొర‌క‌డం లేదు.

Also Read : మాజీ కాబోతున్న బీద రవిచంద్ర .. టీడీపీలో కలవరం..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp