సీఎం జగన్ తీరు పట్ల టాలీవుడ్ పెద్దల సంతృప్తి

By Raju VS Jun. 09, 2020, 06:36 pm IST
సీఎం జగన్ తీరు పట్ల టాలీవుడ్ పెద్దల సంతృప్తి

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎంతో సమావేశమయిన టాలీవుడ్ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో పలువురు సినీ ప్రముఖులు జగన్ తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు వారి సమావేశం జరిగింది. కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. వాటి పట్ల సీఎం జగన్ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమను ఆదుకోవాలని వారు కోరారు. జగన్ ని కలిసిన వారిలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, దిల్ రాజు, సి. కళ్యాణ్ తదితరులున్నారు. షూటింగ్ లు తిరిగి నిర్వహించుకునేందుకు కోరిన వెంటనే అనుమతి ఇవ్వడంపై వారు జగన్ కి కృతజ్ణతలు తెలిపారు. వారితో పాటుగా రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ విజయ్ చందర్, మంత్రి పేర్ని నాని కూడా సమావేశంలో పాల్గొన్నారు.

లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, ఇతర సమస్యలను తాము ప్రస్తావించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని సినీ ప్రముఖులు తెలిపారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం హామీ తమకు ఎంతో ఆనందం కలగజేసిందని వారు అన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంగా కలవాలని అనుకున్నాం కుదరలేదన్నారు. థియేటర్ లు మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని సీఎంని కోరినట్టు వెల్లడించారు.

నంది వేడుకలు పెండింగ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశామన్నారు. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటున్నట్టు వెల్లడించారు. దానికి అనుగుణంగా సీఎం స్పందించడం ఆనందంగా ఉందన్నారు. 2019-20 కి అవార్డుల వేడుక త్వరలోనే జరుగుతుందని భావిస్తున్నాం అన్నారు. టికెట్స్ ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం...పరిశీలిస్తాం అని సీఎం హామీ ఇవ్వడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుందని...పరిశ్రమకు మేలు కలుగుతుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మా కు ఆనందం కలిగించిందని చిరంజీవి తెలిపారు. వైజాగ్ లో స్టూడియో కి వైఎస్సార్ భూమి ఇచ్చారని..దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని సీఎంకి తెలియజేసినట్టు చిరంజీవి వెల్లడించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp