ఏపీ బాటలోనే టికెటింగ్ వ్యవస్థ.. పాపం నోట్లో వెలక్కాయ పడ్డట్టుందే!

By Balu Chaganti Jan. 13, 2022, 07:31 pm IST
ఏపీ బాటలోనే టికెటింగ్ వ్యవస్థ.. పాపం నోట్లో వెలక్కాయ పడ్డట్టుందే!

తెలంగాణలో కూడా త్వరలోనే సినిమా టికెట్ల కోసం ఆన్‌ లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సినీ పరిశ్రమలో అందరితో మాట్లాడి..అందరి అంగీకారం తర్వాత అది అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ తీసుకువస్తామని ప్రకటించిన క్రమంలో సినిమా వాళ్ళ కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు, జనసేన లాంటి ఇతర పార్టీల నాయకులు ఎక్కువ కామెంట్లు చేశారు. అసలు ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ తీసుకు వస్తాము అని ప్రకటించిన మాటకు నెలరోజుల పాటు ఆ డబ్బులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని ఆ డబ్బుతో ఇంకా ఏదో చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి రచ్చ చేశారు.

కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఏపీ బాటలోనే తాము కూడా టికెటింగ్ వ్యవస్థ తీసుకువస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ జగన్ మీద ఎప్పుడు, ఎక్కడ ఎలా దొరుకుతారా, ఆయన మీద ఎలా బురద చల్లాలా, అని ప్రయత్నించే తెలుగుదేశం సహా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థలు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా అదే విధంగా బురద చల్లగలవా? నిజానికి ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అనేది ఉండాలి అని ముందు నుంచి సినీ పరిశ్రమ కోరుతూ వస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ పరిశ్రమ నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే కొన్ని కారణాలతో అప్పటి నుంచి ఈ వ్యవహారం మీద ముందడుగు మాత్రం పడలేదు. 

అయితే సినిమా కలెక్షన్ల వివరాలు, అలాగే తమకు వస్తున్న జిఎస్టి వసూళ్ల మధ్య చాలా తేడా కనిపిస్తోంది అని గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టికెటింగ్ వ్యవస్థను ఆన్లైన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పనులు ప్రారంభించారు కూడా. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయం మీద సినీ పరిశ్రమ నుంచి ఒకరిద్దరు మినహా మిగతా అందరూ సానుకూలంగానే మాట్లాడగా ఇతర పార్టీల నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతోంది జగన్ ఏదో చేసేస్తున్నారు అంటూ బురదజల్లే పనిలో పడ్డారు. మరి అప్పుడు మాట్లాడిన నోళ్ళు ఇప్పుడు ఏమని ప్రశ్నిస్తాయో, అనేది ఆసక్తికరంగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp