పీవీపై ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం.. కాంగ్రెస్ మ‌ల్ల‌గుల్లాలు

By Kalyan.S Aug. 07, 2020, 08:45 am IST
పీవీపై ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం.. కాంగ్రెస్ మ‌ల్ల‌గుల్లాలు

ఆది నుంచీ కాంగ్రెస్ వాదిగా ముద్ర ప‌డిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు అధిక ప్రాధాన్య‌మిస్తూ.. శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏడాది పాటు నిర్వ‌హించ‌నుంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే చాలా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. తెలంగాణ వ్య‌క్తిగా ఆయ‌న‌కు తాము ఇచ్చే గౌర‌వం ఇది అంటూ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఆ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పీవీ.. మ‌న ఠీవి పేరుతో ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆల‌స్యంగా మేల్కొన్న కాంగ్రెస్ ఏదో ఒక రోజు శ‌త‌జ‌యంతి వేడుక‌ల పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించి మ‌మా అనిపించింది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం పీవీకి సంబంధించి ర‌క‌ర‌కాల ప‌నులు చేప‌డుతూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్పుడు తాజాగా పీవీ స్వ‌స్థ‌ల‌మైన వంగ‌ర‌ను ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 28న భూమి పుత్రునికి నీరాజ‌నం పేరిట వంగ‌ర‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది.

పీవీ ర‌చ‌న‌ల పునర్ము‌ద్ర‌ణ‌

పీవీ న‌ర‌సింహారావు ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల పితామ‌హుడే కాదు.. గొప్ప సాహితీవేత్త కూడా. పీవీ సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అతను రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్.. లోపలిమనిషిగా తెలుగులోకి అనువాదమైంది. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలకు సహస్రఫణ్ పేరుతో హిందీ అనువాదం. పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి అబల జీవితం పేరుతో తెలుగు అనువాదం. ఇలా చాలా ర‌చ‌న‌ల‌ను పీవీ ఆవిష్క‌రించారు. ఆయ‌న ర‌చ‌న‌ల‌లోని ప్ర‌ముఖ‌మైన వాటిని మ‌ళ్లీ ముద్రించేందుకు పీవీ శ‌త జయంతి ఉత్స‌వ క‌మిటీ నిర్ణ‌యించింది. సాహిత్యం, వార్తా క‌థ‌నాలు, కార్టూన్లు స‌హా వివిధ ర‌చ‌న‌ల స‌మీక‌ర‌ణ‌కు ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ సేవ‌ల‌ను వినియోగించుకోనున్నారు.

మ‌న‌మేం చేద్దాం : కాంగ్రెస్ లో చ‌ర్చ‌

పీవీ.. మ‌న ఠీవి అంటూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పీవీ నరసింహరావు శత జయంతి ఉత్స‌వాల నేప‌థ్యంలో అనేక ర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. 2020, జూన్ 28 నుండి 2021, జూన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో 2020, జూన్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. అలాగే జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా ఈ నెల 8న ఔష‌ధ వ‌నంలో పీవీ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో పీవీ కుటుంబ స‌భ్యులు, ఆయ‌న అభిమానులు ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. కాంగ్రెస్ నాయ‌కుడైన పీవీ వ‌ర్గం టీఆర్ఎస్ పై ఆక‌ర్షితుల‌వుతుండ‌డం కాంగ్రెస్ పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం గాంధీభ‌వ‌న్ లో శ‌త‌జ‌యంతి స‌భ‌ను ఏర్పాటు చేయ‌డం త‌ప్పా పార్టీప‌రంగా త‌ర్వాత ఏ కార్య‌క్ర‌మమూ చేప‌ట్ట‌లేదు. ప్ర‌భుత్వ దూకుడుతో కాంగ్రెస్ కూడా వ్యూహ ర‌చ‌న చేస్తోంది. పీవీ శ‌త జ‌యంతికి సంబంధించి కార్యాచార‌ణ రూపొందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp