కాబోయే సీఎం కేటీఆర్.. కొట్టిపారేయగలమా..?

తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా వినిపిస్తున్న నినాదం కాబోయే సీఎం కేటీఆర్. అయితే అది ఎప్పటి నుంచో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఎన్నికల అనంతరం కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తారన్న ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లోనే కేసీఆర్ స్పందిస్తూ మరో 15 ఏళ్ల పాటు నేనే సీఎం అంటూ ఎన్నికలకు ముందే చెప్పారు. రెండేళ్ల అనంతరం గత కొన్ని రోజులుగా మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కానున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర పార్టీల నేతలో, టీఆర్ఎస్ చోటా మోటా నేతలో ఈ మాటలంటే అంతగా ప్రాచుర్యం పొందేవి కావు.
టీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతల నోటే ఈ వ్యాఖ్యలు వస్తుండడం.. వాటిని కేటీఆర్ సహా ఎవరూ ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు’ అని పద్మారావు వ్యాఖ్యానించారు. కేటీఆర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న పెద్దలు.. కార్యక్రమానికి వచ్చిన జనాలు పద్మారావు వైపే చూడసాగారు. భాగ్యనగరంలోని సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆఫీస్ ప్రారంభోత్సవంలో పద్మారావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా..
ఇదే కాదు... త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించనున్నారని రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. సీఎం కేసీఆర్ రాజకీయ వారసుడైన కేటీఆర్‌ను సీఎం చేయాలనే డిమాండ్‌కు రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ఆ డిమాండ్‌ను లేవనెత్తే గళానికి బలం కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయాన్ని బహిరంగ సభల్లోనే వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీసుకున్నాయి. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. కేటీఆర్‌ను సీఎం చేస్తే తప్పేంటని వ్యాఖ్యానించారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేముందని అన్నారు. కేటీఆర్ అన్ని పనులు చేయగలడని, సరైన సమయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇదివరకే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటిఆర్ అధ్యక్షతన జరగాలని ఆకాంక్షించారు. యువ నేత కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్‌కు సీఎం అయ్యేలా ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ఇది కేవలం తన ఒక్క అభిప్రాయమే కాదని, చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజి రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చారు. ఈ విషయమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.
స్పందించకపోవడంలో అంతరంగం ఏంటో..?
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ఒక ఎత్తయితే.. కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ ఇలా అనడం రూమర్లకు బలం చేకూరినట్లయ్యింది. పద్మారావు మాట్లాడుతున్నప్పుడు కానీ.. మంత్రి కేటీఆర్ ప్రసంగంలో గానీ దీనిపై ఎలాంటి రియాక్షన్ రాలేదు. రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆఫీస్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషం అని.. ప్రపంచంలోనే గొప్ప స్థితిలో రైల్వేస్ ఉండడానికి కార్మికుల,ఉద్యోగుల కృషే అని మాట్లాడారే కానీ ‘సీఎం’ అన్న వ్యాఖ్యలపై మాత్రం కేటీఆర్ స్పందించలేదు. దీనిపై కేటీఆర్ అంతరంగం ఏంటోనని అక్కడున్న వారు చర్చించుకున్నారు. మరోవైపు ఫిబ్రవరి-14న కేటీఆర్‌కు పట్టాభిషేకం అంటూ పుకార్లు వస్తున్నాయి. మరి అందరూ అనుకున్నట్లుగా ఆ రోజున పట్టాభిషేకం జరుగుతుందో..? లేదో..? వేచి చూడాలి.


Click Here and join us to get our latest updates through WhatsApp