అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ రె"ఢీ"..!

By Kalyan.S Sep. 02, 2020, 07:30 pm IST
అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ రె"ఢీ"..!

కొంత కాలంగా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు కొంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ప్ర‌భుత్వం, అలాగే కేసీఆర్ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నాయి. ఒకానొక ద‌శ‌లో క‌రోనాకు భ‌య‌ప‌డి ఫామ్ హౌస్ కు పారిపోతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తూ హైకోర్టులో సైతం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 15 రోజులు ఫాం హౌస్ లో ఉండి ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు చేరుకున్న కేసీఆర్ త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసే వారికి గ‌ట్టిగా స‌మాధానం చెబుతార‌ని అంతా భావించారు. కానీ.. ఆయ‌న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెడుతూ ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లపై మౌనం వ‌హిస్తున్నారు. స‌చివాల‌యం కూల్చివేత ప‌నులు.. నూత‌న స‌చివాల‌యం నిర్మాణంలోనూ ప్ర‌తిప‌క్షాలు చేసిన రాద్దాంతంపై కేసీఆర్ మాట్లాడ‌లేదు. వీట‌న్నింటికీ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల వేదిక‌గా కేసీఆర్ స‌మాధానం చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంది..?

ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ త‌మ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాల‌ను అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌మే కాకుండా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహం ర‌చించిన‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్, బీజేపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల తాలూకు వివ‌రాల‌న్నీ కేసీఆర్ తెప్పించుకుంటున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో పార్టీ ఎమ్మెల్యేల‌తో ఆయ‌న చ‌ర్చించారు. ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు అసెంబ్లీ వేదిక‌గానే దీటుగా స‌మాధానం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మేర‌కు మంత్రులు పువ్వాడ అజ‌య్, కేటీఆర్, హ‌రీశ్ రావు, ప్ర‌భుత్వ విప్ లు గొంగ‌డి సునీత‌, రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌తో కేసీఆర్ ఇటీవ‌ల స‌మావేశం అయ్యారు.

అలాగే ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ విమ‌ర్శ‌ల‌ను కూడా కేసీఆర్ దృష్టిలో పెట్టుకుని అందుకనుగుణంగా ఇప్ప‌టికే వ్య‌వ‌స్థ‌లో ప‌లు మార్పులు చేశారు. మ‌రోవైపు కాంగ్రెస్ కూడా అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై చిట్టా త‌యారుచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల ద్వారా అసెంబ్లీ స‌మావేశాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp