Amravati, Kanakamedala, Rajya Sabha - రాజకీయం కోసమే వరద.. అజెండా మాత్రం అమరావతే.. నిరూపించిన టీడీపీ ఎంపీ

By Karthik P Nov. 29, 2021, 01:49 pm IST
Amravati,  Kanakamedala, Rajya Sabha - రాజకీయం కోసమే వరద.. అజెండా మాత్రం అమరావతే.. నిరూపించిన టీడీపీ ఎంపీ

కరోనా వచ్చి ప్రజలు పిట్టల్లా రాలిపోనీ, వరదలు ముంచెత్తి కట్టుబట్టలతో మిగలనీ.. మాకు మాత్రం అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగితే చాలు అని ప్రతిపక్ష టీడీపీ మరోసారి నిరూపించింది. ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌ను రాజ్యసభలో జీరో అవర్‌లో ప్రస్తావించాలని టీడీపీ ఏకైక రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ నిర్ణయించుకున్నారు.

రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్‌ కడప, చిత్తూరుతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను మునుపెన్నడూలేని విధంగా వరద ముంచెత్తింది. ఫలితంగా వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 40 మంది మరణించారు. మరో 20 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. గొడ్డు, గోదా కొట్టుకుపోయి.. ఒట్టి చేతులతో మిగిలిన ఆ నాలుగు జిల్లాల ప్రజలను ఆదుకునేందుకు తక్షణం వేయి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. ప్రధాని, హోం మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. వరద ప్రభావిత ప్రాంతాలతో కేంద్ర బృందం పర్యటిస్తోంది.

ఇలాంటి సమయంలో రాష్ట్రానికి చెందిన పార్టీలు ఏవైనా పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వస్తే.. వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతాయి. కానీ టీడీపీ ఇందుకు భిన్నంగా వ్యవహరించాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం ఇంతకు మునుపే పలుమార్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో స్పష్టంగా తెలిపింది. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగానూ సమాధానాలు ఇచ్చింది. రాజధాని విషయంలో తమ జోక్యం ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టులోనూ ఇదే విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో తెలియజేసింది.

Also Read : Development, Andhra Pradesh - సమ్మిళిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు, జగన్ ప్రభుత్వ సంక్షేమ చర్యలతో ప్రగతి

అయినా టీడీపీ ఏకైక రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ మాత్రం.. అమరావతి విషయాన్ని మళ్లీ రాజ్యసభలో ప్రస్తావించేందుకు నిర్ణయించుకోవడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుత సమయంలో.. వరద బాధితులకు కేంద్రం నుంచి వీలైనంత సహాయం రాబట్టడం పార్లమెంట్‌ సభ్యులు ముఖ్య విధి. ఈ దిశగా చట్టసభల్లో వరద బాధితుల సహాయంపై మాట్లాడాలి. కానీ విషయం ఏదైనా సరే తాము రాజకీయంగా ఉపయోగించుకుంటాము గానీ.. అసలు అజెండా మాత్రం అమరావతేనని కనకమేడల తీరు తెలియజేస్తోంది.

ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత జిల్లాలో పర్యటించారు. ప్రజలను ఆదుకోవడం లేదని విమర్శలు చేశారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావించారు. వాటితోపాటు తన భార్యను అగౌరవ పరిచారని కూడా మాట్లాడారు. యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. వరద బాధితుల పట్ల సానుభూతిని వ్యక్తం చేసిన చంద్రబాబు.. కేంద్రం ఆదుకోవాలంటూ మాట్లాడారు. అదే విషయాన్ని తన పార్లమెంట్‌ సభ్యులచేత సభల్లో మాట్లాడించాలని మాత్రం నిర్ణయించలేదు.

కరోనా, వరద ఇలా ఏదైనా సరే రాజకీయ విమర్శల కోసమేనని, అమరావతియే తమ ఏకైక లక్ష్యమని టీడీపీ మరోమారు రుజువు చేసింది. అమరావతిని రాజధానిగా కొనసాగించి ఉంటే భూముల విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఉండేవన్న కనకమేడల రవీంద్ర కుమార్‌ నుంచి.. రాజ్యసభలో ఇతర అంశాల ప్రస్తావన ఆశించడం.. ఏపీ ప్రజల అత్యాశే అవుతుంది.

Also Read : AP High Court, Three Capitals - ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించని ధర్మాసనం.. రాజధాని అంశంలో ఏం జరుగుతోంది..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp