నగదు బదిలీ పథకం మాదేనంటున్న యనమల.. నాటి పాలన గుర్తులేదా..?

By Karthik P Jun. 14, 2021, 12:46 pm IST
నగదు బదిలీ పథకం మాదేనంటున్న యనమల.. నాటి పాలన గుర్తులేదా..?

ఫ్లైట్‌ హైజాకర్లు మాదిరిగా వివిధ రంగాల్లోనూ క్రెడిట్‌ హైజాకర్లు నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటారు. ఒకరు చేసిన పనిని తామే చేశామని వీరు చెప్పుకుంటుంటారు. రాజకీయాల్లోనూ ఈ క్రెడిట్‌ హైజాకర్లకు కొదవే లేదు. రాజకీయాల్లో ఈ తరహా హైజాకింగ్‌కు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరు. సెల్‌ ఫోన్‌ కనిపెట్టడం నుంచి మొదలుపెడితే.. తన ప్రమేయం లేని హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా తానే కట్టానని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని ఇప్పటికీ చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఏదైనా పథకం, కార్యక్రమం విజయవంతమైతే.. దానితో టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు సంబంధం లేకపోయినా.. అది తామే చేశామని చెప్పుకోవడం టీడీపీ నేతలకు బాగా అలవాటైంది.

టీడీపీ క్రెడిట్‌ హైజాకింగ్‌లో తాజాగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం కూడా చేరిపోంది. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ నేతన హస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న అమ్మ ఒడి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకాల ద్వారా అర్హులైన వారికి నేరుగా వారి ఖాతాలకే నగదును ప్రభుత్వం బదిలీ చేస్తోంది. ఫలితంగా ఈ కరోనా సమయంలోనూ ఏపీలోని పేద, మధ్య తరగతి ప్రజలు (రేషన్‌కార్డు ఉన్నవారు) ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. వారి కనీస అవసరాలు తీర్చుకున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయ పక్షపాతం లేకుండా జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలు విజయవంతం కావడంతో.. ప్రజల్లో జగన్‌ సర్కార్‌కు మంచిపేరు వచ్చింది. గ్రామాల్లో రాజకీయ నేతల ప్రమేయం, సిఫార్సులు లేకుండా ప్రభుత్వం నుంచి వలంటీర్ల ద్వారా ప్రజలకు అన్ని పథకాలు అందుతుండడంతో పార్టీలకు అతీతంగా అందరూ జగన్‌పాలనను కొనియాడుతున్నారు.

కేవలం రెండేళ్లలోనే జగన్‌ పథకాలు విజయవంతం అయ్యాయని తాజాగా యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. లబ్ధిదారులకు నగదు బదిలీ టీడీపీ ప్రభుత్వ హాయంలోనే ప్రారంభమైందని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. 2004కు ముందు కొన్ని నిబంధనలను అనుసరించి, ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం అమలు చేశామని చెబుతున్నారు. అంతేకాకుండా విజయవంతంగా సాగుతున్న నగదు బదిలీ పథకాల క్రెడిట్‌ను వైసీపీ ప్రభుత్వానికి దక్కకుండా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇంతకు ముందే నగదు బదిలీ పథకాలను 16 రాష్ట్రాలు అమలు చేశాయని చెప్పుకొస్తున్నారు.

2004కు ముందు టీడీపీ ప్రభుత్వం నగదు బదిలీ పథకాలు అమలు చేసిందని చెబుతున్న యనమల.. అవి 2014లో అమలు చేశామని చెప్పకపోడం ఇక్కడ గమనించాల్సిన అంశం. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ఇంకా గుర్తుంది కాబట్టి.. యనమల 2004కు ముందు చరిత్రను చెబుతున్నట్లుంది. కానీ నాటి బాబు పాలన ఎలా సాగిందో తెలియజెప్పే వారు ఇంకా గ్రామాల్లో ఉన్నారు. బాబు హాయంలో 75 రూపాయల చొప్పన వృద్ధాప్య పింఛన్‌ ఇచ్చేవారు. అర్హులు ఎంత మంది ఉన్నా.. గ్రామంలో పరిమిత సంఖ్యలోనే పింఛన్లు ఇచ్చారు. అర్హుల్లో ఎవరికైనా పింఛన్‌ కావాలంటే.. అప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న వారిలో ఎవరైనా మరణిస్తే తప్పా వేరొకరికి పింఛన్‌ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పాలన సాగించామని యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు గుర్తుందో లేదో..?

Also Read : నామినేటెడ్ పదవుల పందేరం, పక్కా ప్రణాళికతో జగన్ సిద్ధం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp