విశాఖలో టీడీపీ వికెట్‌ పడింది.. సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే

By Kotireddy Palukuri Sep. 19, 2020, 03:36 pm IST
విశాఖలో టీడీపీ వికెట్‌ పడింది.. సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖపట్నంను విభేదించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు, పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కొద్దిసేపటి క్రితం వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు.

తన ఇద్దరు కుమారులతో కలసి తన వద్దకు వచ్చిన వాసుపల్లిని సీఎం జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్‌ తన కుమారులిద్దరినీ పార్టీలో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వైఎస్‌ జగన్‌ వాసుపల్లి గణేష్‌ కుమారులిద్దరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వాసుపల్లి వెంట వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎంపీ విజయసాయి రెడ్డి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఉత్తరాంధ్ర, సీమలోని మెజారిటీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు అంటీముట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తే.. వ్యతిరేకిస్తూ అమరావతికి మద్ధతుగా కార్యక్రమలు చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. వాసుపల్లి గణేష్‌ కూడా చంద్రబాబు తీరును వ్యతిరేకించి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు.


గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది గెలవగా.. వారిలో ఇప్పటికే ముగ్గురు పార్టీని వీడారు. వాసుపల్లి గణేష్‌ నాలుగో ఎమ్మెల్యే. మొదట కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ తర్వాత గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరిలు సీఎంను కలిశారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడుతో కలసి వైఎస్‌ జగన్‌ను కలిశారు. కరణం కుమారుడు వెంకటేష్‌ వైసీపీలో అధికారికంగా చేరారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యే టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీలోనూ అటు వైసీసీ, ఇటు టీడీపీ వైపు కాకుండా ప్రత్యేకంగా కూర్చుంటున్నారు. తాజాగా వీరి సరసన వాసుపల్లి గణేష్‌ కూడా చేరారు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp