చంద్రబాబు ‘చేయి’చ్చాడు

By Kotireddy Palukuri Sep. 15, 2020, 04:30 pm IST
చంద్రబాబు ‘చేయి’చ్చాడు

దేశంలోనే సీనియర్‌ పోలిటీషియన్‌ను అని చెప్పుకునే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీజనల్‌ పాలిటిక్స్‌ చేస్తారని మరోమారు రుజువైంది. ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితుల ఆధారంగా ఆయన రాజకీయాలు ఉంటాయని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అందుకే చంద్రబాబు.. ఏ ఎండకు ఆ గొడుకు పడతారనే విమర్శలు కూడా ఉంది.

తాజాగా ఆయన తనదైన రాజకీయ శైలిని మరోమారు చాటుకున్నారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో బీజేపీపై పోరు సాగించిన చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్‌తో తొలిసారి జతకట్టారు. మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తున్నానంటూ పర్యటనలు జరిపారు. అనుకూల మీడియా కూడా ఢిల్లీతో బాబు డీ, బాబు దెబ్బకు మో‘డీలా’ వంటి శీర్షికలతో ఎప్పటిలాగే బాబు భజన చేసింది. ఎన్నికల పొత్తులో భాగంగా చంద్రబాబు.. కాంగ్రెస్‌ కండువా కూడా కప్పుకున్నారు.

లోక్‌సభ, రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఒక్కసారిగా బాబులో మార్పు వచ్చింది. మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ బాబు మోడీపై చేసిన విమర్శలు, అమిత్‌ షాపై తిరుపతిలో రాళ్లు వేయించడం, మోదీ గో బ్యాక్‌ అంటూ ప్రదర్శించిన బ్యానర్లు ఇంకా బీజేపీ నేతల మెదళ్లలో మెదులుతూనే ఉండడంతో బాబుకు నిరాశే ఎదురైంది. అయితే సమయం చిక్కినప్పుడుల్లా బాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

నిన్న సోమవారం జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం ఏకైక సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ ఎన్‌డీఏ అభ్యర్థి అయిన హరివంశ్‌ సింగ్‌కు ఓటు వేశారు. జేడీయూ నేత అయిన హరివంశ్‌ గెలుపు కోసం ఆ పార్టీ అధినేత బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ ఏపీ, ఒడిశా సీఎంలకు ఫోన్‌ చేసి మద్ధతు కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. అయితే ఎవరూ అడగకపోయినా సరే బాబు పార్టీ ఎన్‌డీఏ అభ్యర్థికి ఓటు వేయడం గమనార్హం.

ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా కాంగ్రెస్‌ సహా విపక్షాలు ఆర్‌జేడీకి చెందిన మనోజ్‌ ఝాను నిలబెట్టాయి. అయితే టీడీపీ మాత్రం ఎన్‌డీఏ అభ్యర్థికి ఓటు వేయడం విశేషం. కాంగ్రెస్‌తో పొత్తును ఇప్పటి వరకూ బాబు అధికారికంగా తెంచుకోకపోయినా.. చర్యల ద్వారా తన వైఖరిని స్పష్టం చేస్తున్నారు. బాబు వాడకాన్ని తెలిసిన వారు ఆయన ఖాతాలో కాంగ్రెస్‌ కూడా చేరిందనే సెటైర్లు వేస్తున్నారు. మొన్నటి వరకూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో బాబు వాడకానికి గురికాని పార్టీగా ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే ఉండేది. తాజాగా కాంగ్రెస్‌ కూడా బాబు వాడకం ఖాతాలో చేరిపోయిందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక పోలింగ్‌తో స్పష్టమైంది. కాంగ్రెస్‌కు చేయిచ్చిన చంద్రబాబు బీజేపీకి దగ్గర కావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? లేదా..? కాలమే చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp