గతమెంతో ఘనం - వరుస ఓటములతో రాజకీయ నిష్క్రమణ ?

By Krishna Babu Aug. 02, 2020, 10:00 am IST
గతమెంతో ఘనం - వరుస ఓటములతో రాజకీయ నిష్క్రమణ ?

రాజకీయ రణరంగమనే చక్రంలో అనేక మంది నాయకులు ఉద్భవించి అలాగే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు, వీరిలో కొందరు మాత్రమే రాజకీయాలపై దశాబ్దాలపాటు తమ ముద్రని చెరిగిపోకుండా నిలుపుకుంటారు, మరికొందరు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా తీవ్ర వివాదాస్పద వ్యక్తిగా పేరుని పొందుతారు. కానీ రాజకీయ ఆరంగ్రేట్రం నుంచే ఒక వెలుగు వెలిగి రాజకీయంగా పలు రికార్డులని తమ ఖాతాలో వేసుకుని , మధ్యలో తీవ్ర వివాదాస్పద వ్యక్తిగా మారి, చివరికి రాజకీయంగ ప్రజా క్షేత్రంలో ఓటమి చెంది, బ్యాక్ డోర్ నేతగా మిగిలిపోయిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో తెలుగుదేశం సీనియర్ నేత, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామ కృష్ణుడు ఒకరు.

రాజకీయ రంగ ప్రవేశం

1951 లో జన్మించిన యనమల రామ కృష్ణుడు ఎల్‌.ఎల్‌.బీ పూర్తి చేశారు. అలాగే ఆర్ట్స్‌లో మాస్ట‌ర్ డిగ్రీని సైతం పూర్తి చేశారు. 1983లో ఎన్.టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో, ఆయన ప్రోద్భలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యనమల తొలి సారి తెలుగుదేశం పార్టీ తరుపున తుని నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ సంపాదించారు. ఆ ఎన్నికల్లో 1955 నుండి 1983 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లో తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తు వచ్చిన రాజా కృష్ణం రాజు బహుద్దురు కుటుంబ ఆధిపత్యానికి గండి కొట్టి తొలి సారి శాసన సభ్యుడిగా 20వేల పైచిలుకు భారీ మెజారిటీతో ఎన్నికై అసంబ్లీలోకి అడుగుపెట్టారు.

శాసన సభ్యుడిగా అరుదైన రికార్డ్

32 ఏళ్ళకే శాసనసభ సభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన యనమల. రాజకీయంగా దశబ్దాల పాటు ఓటమి ఎరగని నేతగా చలామణి అయ్యారు. 1983 నుంచి వరుసగా 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో (డబుల్ హ్యాట్రిక్) కొట్టి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ( ఇలా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన నియోజక వర్గం రాష్ట్రంలో మరొకటి భోగాపురం - తెలుగుదేశం నేత పతివాడ నారాయణ స్వామి నాయుడు) అసంబ్లీకి ఎన్నికైన తొలి సారే ఎన్టీఆర్ మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1989లో తెలుగుదేశం ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితం అవ్వడంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా భాద్యతలు నిర్వహించారు. 1995-99లో శాసనసభ స్పీకర్‌గా, 1999-2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2004 లో తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు.

వరస విజయాలతో దూసుకెల్తున్న యనమల 2009లో తొలి సారి వైయస్సార్ హవా ముందు నిలవలేక 8,510 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో 2013లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయనను శాసన మండలి ఎంపిక చేశారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుండి ఆయన తప్పుకుని ఆ స్థానంలో తన సోదరుడు యనమల కృష్ణుడిని పోటిలోకి దింపగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా చేతిలో 18,573 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో మండలి సభ్యునిగా ఉన్న యనమల రామకృష్ణుడిని చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుని ఆర్ధిక మంత్రిగా భాద్యతలు అప్పచెప్పారు. ఈ హయంలో ఆయన పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. కేసీఆర్ ఆయనకు 2వేల కోట్లు కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టారు అని సొంత పార్టీ వ్యక్తి రేవంత్ రెడ్డి ఆరోపణ చేయడం తీవ్ర దుమారం రేపింది.

2018 రాజ్యసభ ఎన్నికల్లో తనకి రాజ్యసభకు వెళ్ళాలని ఉందని, అదిష్టానం ఆదేశిస్తే వెళతాను అని యనమల బహిరంగంగానే ప్రకటించుకున్నా. చంద్రబాబు తనకి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా ఆయన సోదరుడిని బరిలోకి దింపిన యనమల 24వేల ఓట్ల తేడాతో భారీ అపజయాన్ని మూటగట్టుకొన్నారు. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన యనమల కుటుంబం అదే నియోజకవర్గంలో వరుస అపజయంతో ప్రజాదరణ కోల్పోయిన వ్యక్తిగా పలుచన పడ్డారు.

ఎన్టీఆర్ ను గద్దెదింపడంలో కీలకపాత్ర.

తనకి రాజకీయంగా అవకాశం ఇచ్చి ఎన్నో ఉన్నత స్థాయి పదవులు కట్టబెట్టిన రామారావును చంద్రబాబుతో కలిసి గద్దె దింపటంలో యనమల రామకృష్ణుడుది కీలకమైన పాత్రగా చెప్పవచ్చు. 1994 ఎన్నికల్లో 214 సీట్లతో అఖండ విజయం సాధించిన ఎన్టీఆర్ ను వైస్స్రాయి హోటల్ ఉదంతం నడిపి ముఖ్యమంత్రి అయిన 8 నెలలకే అయనని ఆ పదవి నుండి కూల తోసి చంద్రబాబు 1995 సెప్టెంబర్1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో యనమల అసెంబ్లీ స్పీకర్ గా వ్యవరించడంతో రామారావును ముఖ్యమంత్రి పీఠం నుండి దింపడంలో ఆయనది ప్రధాన పాత్రగా చెప్పవచ్చు.

ఆనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి పై జరిగిన చర్చలో యనమల రామకృష్ణుడు రామారావు పై కాస్త పరుష పదజాలమే వాడారు. ఎన్టీఆర్ నాకు జ్వరంగా ఉంది అని అంటే మీకు జ్వరం వస్తే ఏంటి? ఏమైతే ఏంటి? అది ఇక్కడ ఇష్యునే కాదు అంటు చిన్నబుచ్చారు. రామారావు అసెంబ్లీ సాక్షిగా అధ్యక్షా !! నన్ను ఆఫీసు నుండి విసిరి పాడేశారు . నన్ను గెలిపించిన ప్రజలకి ఈ అసంబ్లీ ద్వారా ఏమి జరిగిందో నేను చెప్పాలి అంటూ యనమలని ఎంత ప్రాదేయ పడ్డా, మాట్లాడే అవకాశం కల్పించకపోగా రామారావుని పట్టుకుని "హు కేర్స్" అంటూ మాట్లాడేసరికి నిర్ఘాంతపోయిన ఎన్టీఆర్ అధ్యక్షా నన్ను ఇంతకంటే అసంబ్లీకి రావద్దంటే సరిపోయేది కద అంటూ వాపోయారు. దీంతో రాజకీయంగా నేను అవకాశం కల్పించిన వ్యక్తే ఈ రోజు నా గోడు చెప్పుకునే అవకాశం కల్పించకుండా నా నోరు నోక్కే ఘాతుకానికి పాల్పడ్డారు అంటూ ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర తన భాధను వ్యక్తపరిచారని చెబుతారు .

ఇలా తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విజయాలుతోపాటు మరెన్నో అపకీర్తులను కూడా మూటగట్టుకున్న యనమల తాను ఇక ప్రత్యక్ష రాజకీయాలనుండి దూరం అవబోతునట్టు తాజాగా సన్నిహితుల దగ్గర చెప్పినట్టు వార్త. ఏది ఏమైనా శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితం తొలి భాగం ఆయనకి కీర్తిని ప్రసాదిస్తే మలి భాగం ఆయనను ప్రజాక్షేత్రంలో వరుస ఓటములతో , మసక బారిన ప్రతిష్ఠతో తీవ్ర నిరాశపరిచిందనే చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp