వైఎస్‌ను పొగుడుతాం...జగన్‌ను విమర్శిస్తాం...!

By P. Kumar Jul. 10, 2020, 12:30 pm IST
వైఎస్‌ను పొగుడుతాం...జగన్‌ను విమర్శిస్తాం...!

తెలుగుదేశం అనుబంధ మీడియా సంస్థలుగా పేరొందిన కొన్ని మీడియా సంస్థలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్న సంగతిని గుర్తించాయా? ఆ ముద్రను బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని అవకాశంగా తీసుకున్నాయా? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిత్యం వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తూ సాగే ఆ ఛానెళ్లు వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఆయన్ను ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ ప్రత్యేక కథనాలు ప్రసారం సర్వత్రా ఆసక్తిగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో మీడియా పార్టీల వారీగా చీలిపోయింది. సోషల్‌ మీడియా, ప్రజల్లో వచ్చిన రాజకీయ, సామాజిక చైతన్యాలు రాజకీయ పార్టీలతో పాటు మీడియా అసలు రంగునూ బహిర్గతం చేస్తోంది. ఫలితంగా సొంత అజెండాతో వార్తలను ప్రసారం చేసే, విశ్లేషణలు గావించే ఛానెళ్లు క్రమేణా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శిస్తూ టీడీపీ కేడర్‌ను ఉత్సాహపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఛానెళ్లకు విశ్వసనీయత లోపించింది. దీన్ని గుర్తించిన సదరు ఛానెళ్లు దిద్దుబాటు చర్యల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ జయంతిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించడంలో ఎప్పడూ ముందుండే టీ5 ఛానెల్‌ వైఎస్‌ఆర్‌ జన్మదినం సందర్భంగా ‘చెరిగిపోని గుండె బలం, నిత్యం చిరునవ్వు’ పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడం విశేషం. అంతేకాకుండా ఎస్సాఆర్‌సీపీకి తలనొప్పిగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుతో ‘వైఎస్సార్‌తో అనుబంధం’ అంటూ కార్యక్రమం నిర్వహించింది. దీంతో ఓ వైపు వైఎస్‌ జగన్‌ను నిత్యం విమర్శిస్తూనే మరో వైపు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని పొగడటం ద్వారా ఛానెళ్లు తటస్థ ముద్రను పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ అనుకూల మీడియా ఛానెళ్లుగా ముద్రపడ్డ వాటిని ఆ పార్టీ కేడర్, అభిమానులు మినహా తటస్థ వర్గాలు చూసేందుకు ఇష్టపడటం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీన్ని గమనించిన సదరు మీడియా సంస్థలు వైఎస్‌ఆర్‌ను పొగడటం ద్వారా మేం మంచిని మంచిగా చెప్తాం అని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వైఎస్‌ జగన్‌ను విమర్శించటాన్ని సమర్థించుకోవాలని వాటి ఆలోచన కావొచ్చు. అయితే గతంలో ఈ ఛానెళ్లే వైఎస్‌ రాజశేఖరెడ్డి మరణించిన కొన్ని రోజులకే మహానేత కాదు మహామేత అంటూ కథనాలు ప్రచురించడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp