62 ఏళ్లకు ఉద్యోగ విరమణ మోసమట!

By Aditya Jan. 14, 2022, 01:15 pm IST
62 ఏళ్లకు ఉద్యోగ విరమణ మోసమట!

ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పీఆర్సీ ప్రకటనతో ఆనందంగా ఉన్న ఉద్యోగులను ఏదోవిధంగా మభ్యపెట్టి ప్రభుత్వంపై వారిని రెచ్చగొట్టాలని టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ ప్రయత్నం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 62 సంవత్సరాలకి పదవీ విరమణ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విషయం పెద్ద మోసమని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఏం న్యాయం చేశారని పాలాభిషేకం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తున్నందుకు సంతోషిస్తున్నారా అని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా మార్చినప్పుడు హైదరాబాదు నుంచి వస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడకూదడనే ఉద్దేశంతో బస్ సౌకర్యం, ట్రైన్ సౌకర్యం, వారానికి పనిదినాలు కూడా 5 రోజులకే తగ్గించారని గుర్తుచేశారు. యూనియన్ పెద్దలు 71 డిమాండ్లు ముఖ్యమంత్రి దగ్గర పెట్టారు. వాటన్నింటి మీద చర్చ జరిగిందా..? అని అయ్యన్న ప్రశ్నించారు.  సీఎం జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే 136 వారాలు అయిందని.. మరి ఎందుకు సీపీఎస్‌ను రద్దు చేయలేదని అయ్యన్న ప్రశ్నించారు.

ఇందులో మోసం ఏముంటుంది?

ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పొడిగించి 62 ఏళ్లకు నిర్ధారిస్తే ప్రభుత్వం ఎలా మోసగించినట్టు అవుతుందో ఆయ్యన్నే చెప్పాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తక్కువగా ఇవ్వాల్సి వచ్చిందని, అయినా ఉద్యోగుల పక్షపాతిగా వారికి ఇతర సదుపాయాలు కల్పిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అందులో భాగంగా 62 ఏళ్లకు రిటైర్మెంట్‌, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్పుల్లోని ఫ్లాట్‌లో 20 శాతం రిబేటు, హెల్త్‌కార్డుల సత్వర జారీ వంటివి ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ, దాని అనుబంధ మీడియా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. పీఆర్సీ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు నిర్వహించి ఉద్యోగులకు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు  ప్రకటనలు ఇవ్వడం, దాన్ని పచ్చ మీడియాలో రచ్చ చేయడం రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. దానికి కొనసాగింపుగా అయ్యన్న చేసిన ప్రకటన మరీ విడ్డూరంగా ఉంది.

కూర్చోడానికి కుర్చీ లేని పరిస్థితుల్లో ఉద్యోగుల గురించి చంద్రబాబు ఆలోచించారు అంటూ చెబుతున్న అయ్యన్న వారానికి పనిదినాలు కుడా 5 రోజులకే తగ్గించారని చెప్పడం ఉద్యోగులను తప్పుదోవ పట్టించడమే. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిలో ఉండే అవకాశం ఉన్నా నోటుకు ఓటు కేసులో దొరికిపోయి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిన చంద్రబాబు, తన అమరావతి డ్రామా రక్తి కట్టించడానికి ఉద్యోగులను బలవంతంగా హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు రప్పించారు. ఆ క్రమంలో వారిని బుజ్జగించడానికి బస్, ట్రైన్ సౌకర్యం, వారానికి పనిదినాలు 5 రోజులకే కుదింపు వంటి గిమ్మిక్కులు చేశారు. ఈ విషయం ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాబు స్వప్రయోజనాల కోసం చేసిన ఈ పనులను ఏదో ఘనకార్యంలా చెప్పడం అయ్యన్నకే చెల్లింది. 71 డిమాండ్లపై అధికారులతో ఉద్యోగ సంఘ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరపడం, వాటిలో 50 పైబడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం అయ్యన్నకు తెలియకుండానే దానిపై వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలి? సీపీఎస్‌పై జూన్‌ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అయినా ఇంకా దాన్నే పట్టుకొని విమర్శలు చేయడం ఎవరిని పక్కదోవ పట్టించడానికి? అయినా ఉద్యోగులు ఆనందంగా ఉంటే అయ్యన్నపాత్రుడికి ఇలా బాధ పడటం ఎవరి మెప్పు పొందడానికి?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp