బీజేపీ అంతర్గతంపై టీడీపీకేల ఆసక్తి?

By P. Kumar Aug. 11, 2020, 06:30 pm IST
బీజేపీ అంతర్గతంపై టీడీపీకేల ఆసక్తి?

ప్రతి రాజకీయ పార్టీకి తనదైన సొంత రాజకీయ విధానం ఉంటుంది. కానీ, తెలుగుదేశం మాత్రం రాష్ట్రంలో బీజేపీ, దాన్ని నడిపించే నాయకులు తమ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలనే వింత పోకడను ప్రదర్శిస్తోంది. కాగా, తాజాగా బీజేపీ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. అవి ఒకింత టీడీపీ ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో టీడీపీ కేడర్, అనుకూల మీడియాలు బీజేపీపై పట్టరాని కోపం ప్రదర్శిస్తున్నాయి.

ఒక పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మరొక పార్టీ జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. కానీ, టీడీపీ మాత్రం బీజేపీ అంతర్గత వ్యవహారాలపై విపరీతమైన ఆసక్తి చూపుతోంది. అంతటితో ఆగకుండా బీజేపీ అంతర్గత వ్యవహారాలపై విమర్శలు వర్షం కురిపిస్తోంది. పనిలో పనిగా అమరావతిపై బీజేపీ విధానాన్ని సైతం తానే నిర్దేశించాలని ప్రయత్నించడంతో బీజేపీకి చిర్రెత్తుకొచ్చింది. టీడీపీపై ఒక్కసారిగా ఎదురుదాడిని ప్రారంభించింది. తాజాగా రాజధాని విషయంలో కేంద్రం ప్రమేయం లేదని, ఏర్పాటులో కేంద్రం ప్రమేయం లేనప్పుడు రాజధాని తరలింపులో కేంద్రం జోక్యం కోరడమేంటంటూ బీజేపీ నాయకత్వం ఘూటుగా స్పందించింది. దాంతో టీడీపీ రాజకీయం పూర్తిగా నీరుగారిపోయింది.

కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిగా పంపడం నుంచి కన్నా స్థానంలో సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించడం వరకు బీజేపీ అంతర్గత విషయాలపై టీడీపీ దుష్ప్రచారం చేసింది. వేరే పార్టీలో స్వీయ ఆసక్తులను వెతుక్కోకూడదనే కనీస సోయ కూడా లేకుండా ఆ పార్టీ వ్యవహరించింది. వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపినప్పుడు మోదీ ఏపీ ప్రయోజనాలను దెబ్బతీశారంటూ తన అనుకూల మీడియాలో వార్తలు వేయించిన టీడీపీ, అమరావతికి వ్యతిరేకంగా, వైఎస్‌ జగన్‌కు మద్దతుగానే బీజేపీ అధిష్టానం సోము వీర్రాజును నియమించిందంటూ ప్రచారం చేసింది. ఇది నిజంగా విడ్డూరమే. ప్రతి పార్టీకి అధ్యక్షుడిని నియమించుకొనే స్వతంత్రత ఉంటుంది. బీజేపీ దానికి మినహాయింపు కాదు. టీడీపీ తరహాలోనే బీజేపీ సైతం చంద్రబాబును తప్పించి వేరొకరిని అధ్యక్షుడిని చేయాలంటూ డిమాండ్‌ చేస్తే ఆ పార్టీ సమ్మతిస్తుందా? అదే జరిగితే టీడీపీ ఏం సమాధానం చెప్తుంది..!

సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ గీతను దిక్కరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వెలగపూడి గోపాలకృష్ణ, ఓవీ రమణలను సస్పెండ్‌ చేశారు. ఇది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారం. కానీ, తెలుగు తమ్ముళ్లు, పసుపు మీడియా మాత్రం సోము వీర్రాజుపై రంకెలేస్తున్నాయి. ఇలాగైతే ఏపీ బీజేపీ ఖాళీ అంటూ ఎక్కడాలేని బాధను ప్రదర్శిస్తున్నాయి. నిజంగానే సోము వీర్రాజు చర్యలతో బీజేపీ ఖాళీ అయితే పోటీ పార్టీగా టీడీపీ అనందపడాలి కాదా? కానీ ఎందుకు రోధిస్తోంది?దానికి కారణం సస్పెన్షన్‌కు గురైంది తమకు కావాల్సిన మనుషులు కావడం, బీజేపీ వైఖరి తమకు వ్యతిరేకంగా ఉండటమే. బీజేపీ సైతం ఏపీలో ప్రతిపక్షం పాత్ర ఖాళీగా ఉందంటూ హాట్‌ కామెంట్లు చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో బీజేపీ, టీడీపీల మధ్య రాజకీయ వేడి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp