పేద, మధ్యతరగతి అంటే అంత చులకనా..?

By Karthik P Jan. 12, 2021, 02:30 pm IST
పేద, మధ్యతరగతి అంటే అంత చులకనా..?

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని పేద, మధ్యతరగతి ప్రజలను చులకనచేస్తోంది. ప్రభుత్వ పథకాలు పొందే కుటుంబాల్లోని మగవాళ్లందరూ మద్యం తాగుతారంటూ అవమానిస్తోంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిన రోజున ఆ పథకం విశిష్టతను తగ్గించేందుకు టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి నోటికి వచ్చిన రైమింగ్‌ పదాలతో విమర్శలు చేస్తున్నారు. ఈ కోవలోనే నిన్న అమ్మ ఒడి పథకం రెండో విడత అమలైన సందర్భంగా.. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మీడియా ముందుకు వచ్చారు. ‘ అమ్మ ఒడి డబ్బులు.. నాన్న బుడ్డికి’ అంటూ విమర్శలు మొదలుపెట్టారు.

అందరూ మద్యం తాగేవారేనా పట్టాభి..?

కుడిచేత్తో అమ్మ ఒడికి డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి.. అంతకు రెట్టింపు సొమ్మును నాన్న బుడ్డి పేరుతో ప్రభుత్వం లాగేసుకుంటోందని పట్టాభిరామ్‌ విమర్శించారు. అంతేకాకుండా కుటుంబంలో మగవారి సంపాదనంతా మద్యం షాపులకే పోతుండడంతో.. భార్యా బిడ్డలు పస్తులుంటున్నారని కూడా పట్టాభిరామ్‌ సెలవిచ్చారు. అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది తల్లులకు ఆర్థిక లబ్ధి జరుగుతోంది. 15 వేల రూపాయల చొప్పన ప్రతి తల్లికి ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో ఈ ఏడాది వెయి రూపాయలు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు మినహాయించింది. మొత్తం మీద ప్రభుత్వం 6700 కోట్ల రూపాయలు 45 లక్షల మంది తల్లులకు అందించింది. పట్టాభిరామ్‌ చెప్పిన మాటలు నిజమనుకుంటే.. ఈ 45 లక్షల మంది మహిళల భర్తలు మద్యం తాగేవారు.. వారి సంపాదన అంతా మద్యం తాగేందుకే ఖర్చు చేస్తున్నారు... అదీ చాలక అమ్మ ఒడి డబ్బులు కూడా మద్యం దుకాణాలకే పోస్తున్నారు... అందుకే భార్య, పిల్లలు పస్తులుంటున్నారని అనుకోవాలి. ఇలాంటి ఆలోచనలు, గణాంకాలతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఏమనుకుంటోంది అర్థమవుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలను అవహేళన చేసేలా టీడీపీ రాజకీయాలు చేయడం అత్యంత విచారకరం.

నిజాలు చెబుతున్న పట్టాభి..

అమ్మ ఒడి పథకం విశిష్టతను తగ్గించేందుకు గణాంకాలతో విమర్శలు చేస్తున్న టీడీపీ అధికార ప్రతినిధి.. ఆ క్రమంలో అసలు నిజాలు చెబుతూ ప్రభుత్వానికి మేలే చేస్తున్నారు. అమ్మ ఒడి పేరుతో ప్రభుత్వం రెండేళ్లలో 13 వేల కోట్ల రూపాయలు ఇచ్చి.. మద్యం ద్వారా 15 వేల కోట్ల రూపాయలు సంపాదించిందనేది పట్టాభి విమర్శ. పట్టాభి చెప్పిన గణాంకాలు వాస్తవమైనవే. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుంది. రెండేళ్లలో 15 వేల కోట్లు అంటే.. ఏడాదికి 7,500 కోట్ల రూపాయలు. అదే టీడీపీ హాయంలో మద్యం ఆదాయం ఏడాదికి 15 వేల కోట్ల రూపాయలన్న విషయం పట్టాభి ఒక్క సారి గుర్తు చేసుకోవాలి. అప్పటికి ఇప్పటికి ఆదాయం తగ్గడానికి కారణం ఏమిటో కూడా పట్టాభికే కాదు రాష్ట్ర ప్రజలకు తెలుసు.

పట్టాభి ఆ సాహసం చేయగలరా..?

మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని టీడీపీ ఏమి చేసిందీ పట్టాభి చెప్పలేని పరిస్థితి. కానీ వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం వైపు అడుగుల వేస్తోంది. దుకాణాలు తగ్గించింది. అందుకే ఆదాయం కూడా తగ్గింది. మరో వైపు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తోంది. రెండేళ్లలో ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారానే 13 వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చింది. ఇది కాకుండా వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ కాపు నేస్తం, జగనన్న చేదోడు వంటి అనేక పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో ప్రజలకు ఏమి మేలు జరిగింది..? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరుగుతోంది.. పట్టాభి చెబితే.. పేద, మధ్య తరగతి ప్రజలు వినాలనుకుంటున్నారు. మరి మద్యం ఆదాయాన్ని చూపుతూ.. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు జరిగిన లబ్ధిని చెప్పే సాహసం పట్టాభి చేయగలరా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp